గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా.. మరోవైపు గత రెండేళ్లుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ఊహించని పతనాన్ని చవిచూస్తున్నాయి.
గత వారం పసిడి ధరలకు గత 15 ఏళ్లలో అత్యంత దారుణమైన వారంగా నమోదైంది. సెప్టెంబర్ 2011 తర్వాత ఇంతటి భారీ వారపు పతనం ఎప్పుడూ జరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి ఔన్సుకు 4,574.90 డాలర్ల వద్ద ముగిశాయి. కేవలం ఒక్క వారంలోనే Gold ధర దాదాపు 9.6 శాతం పడిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మార్చి 2026 అనేది బంగారం మార్కెట్‌కు అత్యంత గడ్డు కాలంగా మిగిలిపోయే అవకాశం ఉంది.

వెండి పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. సిల్వర్ ఫ్యూచర్స్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయి 69.66 డాలర్ల వద్దకు చేరాయి. ఈ వారంలో వెండి ఏకంగా 14 శాతం నష్టపోయింది. దేశీయ మార్కెట్ (MCX)లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 13న తులం Gold ధర రూ. 1.58 లక్షల పైన ఉండగా, ప్రస్తుతం అది రూ. 1.45 లక్షల దిగువకు పడిపోయింది. అలాగే వెండి ధర కూడా కిలోకు రూ. 2.6 లక్షల నుండి రూ. 2.3 లక్షల కంటే తక్కువకు పడిపోవడం గమనార్హం.
బంగారం, వెండి ధరల పతనానికి ప్రధానంగా 'ప్రాఫిట్ బుకింగ్', పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2025లో బంగారం 66%, వెండి 135% మేర అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. ఇంతటి భారీ పెరుగుదల తర్వాత ధరలు కొంత మేర తగ్గడం సహజమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అలాగే ప్రపంచవ్యాప్తంగా కొత్త రకమైన ఆస్తులు (Assets) అందుబాటులోకి వస్తున్నాయి.
బంగారంపై ఆశించిన దానికంటే ఎక్కువ రాబడులు ఇప్పటికే రావడంతో, పెద్ద పెట్టుబడిదారులు తమ నిధులను బంగారం నుండి ఉపసంహరించుకుని ఇతర లాభదాయక రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు.ఇక ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొనడం పెట్టుబడిదారులను బంగారంపై దూకుడుగా వ్యవహరించకుండా నిరోధిస్తున్నాయి.
స్వల్పకాలంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలికంగా బంగారంపై నమ్మకం చెక్కుచెదరలేదు. ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇప్పటికీ సానుకూల అంచనాలనే వ్యక్తం చేస్తున్నాయి. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం.. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. అలాగే జేపి మోర్గాన్ అంచనా ప్రకారం.. బంగారం క్రమంగా 5 వేల డాలర్ల మార్కును దాటుతుందని పేర్కొంది.ఇక మాక్వారీ గ్రూప్ అంచనా ప్రకారం.. 2026 నాటికి బంగారం సగటున 4,300 నుంచి 4,600 డాలర్ల మధ్య, వెండి 62 నుంచి 75 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
ప్రస్తుతానికి వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల బంగారం ధర ఒకే పరిధిలో (Range-bound) ఉండవచ్చు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical risks), ఆర్థిక అనిశ్చితి పెరిగితే, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం మళ్లీ పుంజుకోవడం ఖాయం. పెట్టుబడిదారులు ఈ పతనాన్ని ఒక అవకాశంగా భావించి, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications