బంగారం, వెండి ధరలు మెగా క్రాష్.. ర్యాలీ కథ కంచికి.. కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు..
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్‌లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
దేశీయ మార్కెట్ MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,849కి తగ్గగా,.. వెండి ధర కిలోకు సుమారు రూ.2.92 లక్షల స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా COMEXలో Gold 8 శాతం కంటే ఎక్కువగా పడిపోయి ఔన్సుకు 4,879.60 డాలర్లకి దిగివచ్చింది. వెండి పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కరోజులోనే దాదాపు 25.5 శాతం పతనంతో వెండి ఔన్సుకు 85.25 డాలర్లకి చేరింది.
ఈ భారీ పతనం వెనుక అసలు కారణాలేమిటన్నది ఇప్పుడు మార్కెట్‌లో ప్రధాన చర్చాంశంగా మారింది. అంతేకాదు, ఇంతకాలం "సేఫ్ హెవెన్" పెట్టుబడులుగా భావించిన బంగారం, వెండి ఇప్పుడు ఆ స్థాయిని కోల్పోతున్నాయా? లేదా ఇది కేవలం తాత్కాలిక సవరణ మాత్రమేనా? అన్న ప్రశ్నలు పెట్టుబడిదారులను వెంటాడుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పతనానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన రికార్డు స్థాయి ర్యాలీ అనంతరం చోటుచేసుకున్న లాభాల బుకింగ్. Gold, వెండి ధరలు అత్యధిక స్థాయిలను తాకిన తర్వాత పెద్ద ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడం సహజమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్లస్‌క్యాష్ వ్యవస్థాపకుడు, CEO ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ క్షీణతను దీర్ఘకాలిక ట్రెండ్ మార్పుగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలమైన అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ యీల్డ్స్, అలాగే మార్కెట్‌లో అధిక పొజిషనింగ్ వంటి అంశాలు ధరలపై ఒత్తిడి తెచ్చాయని ఆయన తెలిపారు. అదేవిధంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి కూడా విలువైన లోహాలపై ప్రభావం చూపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ఫెడ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను అమెరికా సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా ఎంపిక చేసినట్లు ప్రకటించడం మార్కెట్‌ను మరింత అప్రమత్తం చేసింది. వార్ష్ ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరి కలిగిన విధాన నిర్ణేతగా పేరుగాంచిన వ్యక్తి. వడ్డీ రేట్ల కోతల విషయంలో ఆయన అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చనే ఊహాగానాలు బంగారం, వెండి ధరలపై నెగెటివ్ సెంటిమెంట్‌ను పెంచాయన్నారు.
ఆనంద్ రతి షేర్స్ & స్టాక్ బ్రోకర్స్‌లో కమోడిటీస్, కరెన్సీల విభాగం AVP మనీష్ శర్మ మాట్లాడుతూ.. ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించాల్సిన అవసరం ఉందన్న వార్ష్ అభిప్రాయాలు మార్కెట్‌ను కలవరపెట్టాయని అన్నారు. ద్రవ్యోల్బణ ప్రమాదాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ట్రేడర్లను అప్రమత్తం చేస్తున్నాయని చెప్పారు.
అయితే, దీర్ఘకాలికంగా బంగారం, వెండి పూర్తిగా బలహీనపడతాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, సరఫరా పరిమితులు వంటి అంశాలు మధ్యస్థ, దీర్ఘకాలంలో ధరలకు మద్దతుగా నిలుస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ పతనాన్ని ట్రెండ్ రివర్సల్‌గా కాకుండా, వ్యూహాత్మక కొనుగోలు అవకాశంగా చూడవచ్చని సూచిస్తున్నారు.కొంతకాలం అస్థిరత కొనసాగవచ్చని, కానీ ధరలు ఒక స్థిర స్థాయిలో స్థిరపడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలకు బదులు, దీర్ఘకాల దృష్టితో అడుగులు వేయడం ఉత్తమమని హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications