గ్లోబల్ బెస్ట్ సెల్లర్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన చురుకైన అభిప్రాయాలతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించారు. బంగారం, వెండి లేదా క్రిప్టోకరెన్సీల ధరలు ఎక్కడికి వెళ్లినా పట్టించుకోనని తెలిపాడు. దీనిపై సామాజిక మాధ్యమం Xలో ఆయన చేసిన తాజా పోస్ట్ విస్తృత చర్చకు దారి తీసింది. నేను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియంలను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నాను. ధరలు పెరిగినా తగ్గినా నాకు సంబంధం లేదు. అలా చేస్తూనే నేను ధనవంతుడిని అవుతున్నానని స్పష్టంగా పేర్కొన్నారు.
ఫియట్ కరెన్సీలు, ప్రభుత్వ మద్దతుతో నడిచే ద్రవ్య వ్యవస్థలపై ఎన్నాళ్లుగానో విమర్శలు చేస్తూ వస్తున్న కియోసాకి.. ఈసారి కూడా అమెరికా జాతీయ రుణం వేగంగా పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి క్రమంగా క్షీణించడమే తన ఆలోచనలకు మూలమని వివరించారు. అయితే కరెన్సీ విలువ తగ్గడం దీర్ఘకాలిక ధోరణిగా మారినప్పుడు.. రోజువారీ ధరల హెచ్చుతగ్గులు కరెక్ట్ కాకపోవచ్చని ఆయన అభిప్రాయం. ఫెడరల్ రిజర్వ్, ట్రెజరీ వంటి కీలక సంస్థలను నడిపిస్తున్న విధాన నిర్ణేతల నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. ఫెడ్, ట్రెజరీ, అమెరికా ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న ఉన్నత విద్యావంతులైన పీహెచ్‌డీలు ఉన్నప్పుడు, బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరల గురించి నేను ఎందుకు ఆందోళన చెందాలి? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన సమయంలోనే వెండి ధరలు చరిత్రాత్మక స్థాయికి చేరుకోవడం గమనార్హం. శుక్రవారం వెండి తొలిసారిగా ఔన్సుకు 100 డాలర్ల మార్కును దాటగా, స్పాట్ మార్కెట్‌లో ధర 6.9 శాతం పెరిగి రికార్డు స్థాయిలో ఔన్సుకు 102.87 డాలర్లకు చేరింది. గత ఏడాది ధరలు రెట్టింపు అయిన తర్వాత, ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధరలు 40 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి.
బంగారం కూడా అదే తరహాలో బలమైన ర్యాలీని కొనసాగిస్తోంది. న్యూయార్క్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4,981 డాలర్ల వద్ద ట్రేడవుతూ, 5 వేల డాలర్ల మైలురాయికి దగ్గరగా ఉంది. వారానికి 8 శాతం కంటే ఎక్కువ లాభంతో.. ఇది మార్చి 2020 తర్వాత బంగారానికి వచ్చిన బలమైన వారపు ప్రదర్శనగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాలు కూడా కొత్త రికార్డులను నమోదు చేశాయి.
ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడులు, ద్రవ్య విధానంపై సందేహాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీకాలం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే ఈ అనిశ్చితులు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా దిగుమతి సుంకాల భయాలు వెండిని న్యూయార్క్‌కు తరలించేందుకు పోటీని పెంచగా.. లండన్ మార్కెట్‌లో సరఫరా ఒత్తిడి ఏర్పడింది. అలాగే ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు ఫలితం ఇవ్వకపోవడం, ఫెడరల్ రిజర్వ్ స్వాతంత్ర్యంపై ఆందోళనలు పెరగడం కూడా సేఫ్-హేవెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి.
అధిక రుణాలు, డబ్బు ముద్రణ చివరికి కరెన్సీ విలువను తగ్గించి, పొదుపుదారులను దెబ్బతీస్తాయని Robert Kiyosaki పదేపదే హెచ్చరిస్తున్నారు. జీతం, పొదుపులు, బాండ్లపై మాత్రమే ఆధారపడకుండా, బంగారం, వెండి, క్రిప్టో వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆయన సందేశం ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications