బంగారం కొనుగోలుపై బ్యాకింగ్ నిపుణులు కీలక అప్‌డేట్.. లాభాలు రావాలంటే ఈ ధర వద్దే కొనుగోలు చేయండి..
బంగారం ధరలు ప్రస్తుతం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ, దేశీయ మార్కెట్లలోనూ గోల్డ్ రేట్ రికార్డులను తిరగరాస్తోంది. వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే కేంద్ర బ్యాంకుల నుంచి బంగారంపై నిరంతర కొనుగోళ్లు జరుగుతుండటం వల్ల బంగారానికి బలమైన మద్దతు లభిస్తోంది. ఈ అంశాలన్నీ కలిసి బంగారం ధరలను ఎగబాకేలా చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిన్న ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,445.69 డాలర్లకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ధరల పెరుగుదల స్పష్టంగా చూపిస్తోంది. ఆర్థిక అనిశ్చితి పెరిగిన ప్రతిసారి పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక భద్రమైన ఆశ్రయంగా భావిస్తారు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా Gold ధరలు భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ డేటా ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1,38,550 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,000కు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,03,910కు చేరింది. ఇటీవలి కాలంలో ఇలాంటి Gold ధరలు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.బంగారం ధరలు వేగంగా పెరిగిన తర్వాత కొంత అస్థిరత వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధరలు ఎందుకు ఇంత బలంగా కొనసాగుతున్నాయనే అంశంపై నిపుణులు కీలక కారణాలను చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ఉపాధ్యక్షురాలు అక్ష కాంబోజ్ తెలిపారు. బంగారం ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ, పెట్టుబడి డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలపై ఉన్న అంచనాలు, అలాగే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ధరలను నిలబెడుతున్న ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు కలిసి బంగారానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. కరెన్సీ విలువల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణగా బంగారం ఎప్పటికీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. అయితే పరిస్థితులు మారితే ధరల్లో కొంతకాలం స్థిరత్వం లేదా స్వల్ప హెచ్చుతగ్గులు ఉండొచ్చని కూడా హెచ్చరించారు.
LKP సెక్యూరిటీస్‌కు చెందిన జతీన్ త్రివేది ప్రకారం.. బంగారం ప్రస్తుతం ఓవర్‌బాట్ జోన్‌లోకి ప్రవేశించింది. 10 గ్రాములకు రూ.1.34 లక్షల కంటే దిగువకు వస్తే లాభాల బుకింగ్ కనిపించే అవకాశముందని ఆయన అన్నారు. అలాగే రూ.1.37 లక్షల స్థాయి ప్రస్తుతం బలమైన నిరోధక స్థాయిగా పనిచేస్తోందని వివరించారు. ఈ వారం విడుదలయ్యే అమెరికా ఆర్థిక గణాంకాలైన కోర్ PCE ధర సూచిక, నిరుద్యోగ క్లెయిమ్‌లు వంటి డేటా.. బంగారం ధరల దిశను నిర్ణయించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications