బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. ధరలు ఇప్పట్లో దిగే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే లక్ష మార్కుని దాటిన బంగారం ఇంకా పైకి పాకేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పసిడిపై సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారంపై దిమ్మతిరిగే నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కేంద్ర బ్యాంకులు వరుసగా మూడవ సంవత్సరం 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2025 సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్ (CBGR) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
గత 10 ఏళ్లలో.. ప్రతి సంవత్సరం సగటున 400 నుండి 500 టన్నుల బంగారాన్ని కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఇప్పుడు బంగారాన్ని సురక్షితమైనదిగా భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్ని అనిశ్చితి పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం, పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ కలవర పరుస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బంగారం మీద పెట్టుబడిని సురక్షితమైనదిగా కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) సర్వే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సర్వేగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 25, మే 20 2025 మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 73 కేంద్ర బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ బ్యాంకులన్నీ చెప్పిన సమాధానం ఒకటే..అదేంటంటే...బంగారాన్ని తమ నిల్వలలో ముఖ్యమైన భాగంగా చేసుకుంటున్నామని..ఇది సరిపోదన్నట్లు ఈ నివేదిక ప్రకారం.. 43% కేంద్ర బ్యాంకులు రాబోయే సంవత్సరంలో తమ బంగారు నిల్వలను రికార్డు స్థాయిలో పెంచుకోవాలని యోచిస్తున్నాయి.
అంతే కాకుండా 95 శాతం కేంద్ర బ్యాంకులు రానున్న ఏడాదిలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల దగ్గర బంగారం నిల్వలు పెరుగుతూనే ఉంటాయని విశ్వసిస్తున్నాయి.మార్కెట్లో గందరగోళం ఉన్నప్పుడు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే పసిడికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
ఈ నివేదికలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే..రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ నిల్వలలో US డాలర్ వాటాను తగ్గించడం.. దాదాపు 73% కేంద్ర బ్యాంకులు రాబోయే ఐదు సంవత్సరాలలో డాలర్ ను వదిలేస్తున్నాయని దాని స్థానంలో బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా నివేదిక తెలిపింది. దీనికి కారణం ఏంటంటే..చాలా దేశాలు డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని విశ్వసనీయమైనదిగా, అత్యంత విలువైనదిగా గుర్తిస్తున్నాయి. దీనికి కరెన్సీలతో పని ఉండదని భావిస్తున్నాయి. అలాగే యూరో, రెన్మిన్బి (చైనీస్ కరెన్సీ), బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నాయి.
గతేడాది..41% కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ ఉంచుకోగా ఈ ఏడాది అది 59శాతానికి పెరిగింది. రాబోయే ఒక సంవత్సరంలో కేవలం 7% కేంద్ర బ్యాంకులు మాత్రమే దేశీయ నిల్వను పెంచాలని ప్రయత్నిస్తున్నాయి. దీనర్థం ఏంటంటే చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుతో సంతృప్తిగా ఉన్నాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications