Gold Rate: గోల్డ్ రేట్లతో జాగ్రత్త.. అమెరికా పరిణామాలతో పసిడి కుదేలు, రేటు ఇంకా తగ్గుతుందా..?
Gold News: దాదాపు వారం రోజులుగా పసిడి ధరల పతనం కొనసాగుతూనే ఉంది. కొన్ని నెలలుగా ఊహకందని స్థాయిలో పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు తిరిగి వెనక్కి వస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనా లేక మళ్లీ ధరలు పుంజుకుంటాయా అనే గందరగోళం చాలా మందిని వెంటాడుతోంది.
ఈసారి సామాన్య ప్రజలను ఆకట్టుకునే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కేంద్రంగా పెద్ద వరం ప్రకటించింది. ఈ క్రమంలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి పన్ను రేట్లను 15 శాతం నుంచి ఏకంగా 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది పతనమైన పసిడి రేట్లను మరింతగా తగ్గించింది. అయితే బడ్జెట్ ప్రకటనలకు ముందు నుంచే గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతూ ఉన్నాయి.

ఈ క్షీణతకు ప్రధానమైన కారణం గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు, ఈ ఏడాది చివరి లోపు యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అలాగే మరోపక్క ఇన్వెస్టర్లు దీనికి అనుగుణంగా తమ డబ్బును పసిడి నుంచి బాండ్ మార్కెట్లకు మారుస్తున్నారు. దీంతో US బాండ్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వ మార్పు ఉంటుందని దాదాపుగా తెలుస్తోంది. దీంతో పెట్టుబడుల్లో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్‌కు తరలిపోతోంది. ట్రంప్ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా మారితే అమెరికా కంపెనీలు ప్రపంచాన్ని శాసించడం ఖాయంగా కనిపిస్తున్న వేళ ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుని వాటిని ఈక్విటీల్లోకి తరలిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ రేసులో ముందుగా ప్రవేశించాలనే ప్రధాన లక్ష్యంతో తమ గోల్డ్ హోల్డింగ్‌ల నుండి బయటికి వెళ్లి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు అమెరికాలో విడుదలైన రెండవ త్రైమాసిక జీడీపీ వృద్ధి అంచనాలు, వ్యక్తిగత వినియోగ వ్యయాలు (PCE) ధరల సూచిక డేటా పసిడి ధరలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. ఈ తరుణంలో దేశీయంగా పసిడి విక్రయ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు నేడు పెరిగి రూ.6325గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.6900గా కొనసాగుతోంది. గోల్డ్ సిల్వర్ రేట్లలో పతనం మరింతగా కొనసాగవచ్చని తెలుస్తోంది. అయితే ఇవి అమెరికాలోని పరిస్థితులకు అనుగుణంగా రానున్న రోజుల్లో స్వల్పంగా పుంజుకునే అవకాశాలు సైతం ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications