స్వల్పంగా పెరిగిన బంగారం! వెండి మాత్రం రికార్డు స్థాయిలో..! ఇంకా పెరుగుతాయా? అంచనా ఇదే!
డిసెంబర్ 12, 2025 న భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు రోజు ముగింపుతో పోలిస్తే.. పసిడి ధర 0.54% పైకి కదిలింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,33,200 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే రూ.720 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,22,100 గా నమోదైంది. ఇదిలా ఉంటే వెండి ధరలు ఏకంగా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2 లక్షల మార్క్ దాటింది.
భారతదేశంలో బంగారం ధరలు(Gold Price Today) అనేవి ప్రధానంగా అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ రేట్లు, అమెరికన్ డాలర్ విలువలో హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. అలాగే బంగారంపై విధించే దిగుమతి సుంకాల వంటి అంశాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.

ప్రధాన నగరాలలో ఇలా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప తేడాలతో ఉన్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబైలో రూ.1,33,200 ఉండగా, హైదరాబాద్‌లో రూ.1,33,410 వద్ద ఉంది. చెన్నైలో అత్యధికంగా రూ.1,33,590 పలకగా.. ఢిల్లీలో రూ.1,32,970, బెంగళూరులో రూ.1,33,300, అహ్మదాబాద్‌లో రూ.1,33,370, కోల్‌కతాలో రూ.1,33,020 గా నమోదయ్యాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం
నేడు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ నుండి వస్తున్న బలహీనమైన డేటా. అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరగడం, కార్మిక మార్కెట్ పరిస్థితులు చల్లబడటం వంటి అంశాలు. అలాగే 2026 లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అదనంగా తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు కూడా ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
ప్రస్తుతానికి అమెరికన్ డాలర్ విలువ తగ్గుతూ ఉంది. డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం వంటి విలువైన లోహాలు ఇతర కరెన్సీలను కలిగి ఉన్నవారికి చౌకగా మారుతాయి. దీనివల్ల బంగారం కొనుగోలు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరలు పెరుగుతాయి.
భవిష్యత్తు అంచనాలు (Outlook)
విశ్లేషకుల ప్రకారం.. డాలర్ ఇండెక్స్ బలహీనంగా ఉండటం వలన బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2026 లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ ఆశిస్తున్నందున పసిడి ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే, ఫెడరల్ రిజర్వ్ ఛైర్ జెరోమ్ పావెల్ మాత్రం 2026 లో ఒక్కసారి, 2027 లో ఒక్కసారి మాత్రమే రేట్ కట్ ఉంటుందని సూచించారు.
ఇన్వెస్టర్లు జాగ్రత్త..
పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు కేవలం దేశీయ ధరలను మాత్రమే కాకుండా అంతర్జాతీయ ట్రెండ్‌లను కూడా గమనించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గా బంగారం ఎప్పుడూ సరైన పెట్టుబడిగానే ఉంటూ వస్తోంది. కాబట్టి ఇన్వెస్టర్లు సరైన సమయంలో బంగారం పెట్టుబడి పెట్టడం మంచిది.


Click it and Unblock the Notifications