Gold Prices: అక్షయతృతీయ వచ్చేస్తోంది.. బంగారం ధరలపై ప్రభావం ఇదే.. నేటి ధరలిలా..!
Akshaya Tritiya: మరికొన్ని రోజుల్లో దేశంలో అక్షయతృతీయ రాబోతోంది. పండుగ సమయం వస్తున్న తరుణంలో ఇప్పటికే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే పండుగ డిమాండ్ ప్రభావం పసిడిపై ఎలా ఉండనుంది..? ఇంకా బంగారం ధరలు పెరుగుతాయా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం గోల్డ్ ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కొత్త ట్రెండ్ ఏంటంటే.. బంగారం ధరలు ప్రతినెలా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దీనికి తోడు దేశీయంగా పండుగల సీజన్ అందులోనూ అక్షయతృతీయ ఏప్రిల్ 22న వస్తున్న తరుణంలో చాలా మంది కనీసం ఒక్క గ్రామైనా బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారు.

అక్షయతృతీయ రోజున భారీగా బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు ఆ ఒక్కరోజే వందల కోట్లలో జరుగుతుంది. కరోనా సమయంలో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగలేదు. వినియోగదారులు, రిటైలర్ల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా బంగారం ధరలు సాధారణంగా అక్షయ తృతీయ రోజు, తరువాతి రోజుల్లో పెరుగుతాయి. రానున్న పది రోజుల్లో 10 గ్రాముల ధర రూ.65 వేల మార్కును చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అధిక ధరల కారణంగా ఈ సారి డిమాండ్ తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాదితో పోల్చితే డిమాండ్ కేవలం 50 శాతం మాత్రమే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అస్థిరత పరిస్థితులు, ద్రవ్యోల్బణం వల్ల పెద్ద ఇన్వెస్టర్లు సైతం తమ డబ్బును బంగారం వైపు మళ్లీస్తున్నారు. దీనికి తోడు దిగుమతి సుంకాలు, జీఎస్టీ, తరుగు, హాల్ మార్కింగ్ ఛార్జీలు, మజూరి ఇలా అన్ని కలుపుకుంటే తడిసి మోపెడవుతుంది.

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.61,920, ముంబైలో రూ.61,200, దిల్లీలో రూ.61,350, బెంగళూరులో రూ.61,250, హైదరాబాదులో రూ.61,200 ఉండగా.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి నగరాల్లో రూ.61,200గా ఉన్నాయి. ఇక కిలో వెండి ధర నిన్నటి పోల్చితే రూ.650 పెరిగి ప్రస్తుతం రూ.78,000 వద్ద కొనసాగుతోంది. నిన్న వెండి ధర భారీగానే పెరిగింది.


Click it and Unblock the Notifications