Gold @ 70000: ఒకపక్క స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతుంటే.. మరోపక్క బంగారం, వెండి ధరలు సైతం ఊహించని ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధర తన రికార్డులను తానే బద్ధలుకొట్టుకుంటూ పోతోంది. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున MCXలో బంగారం 10 గ్రాముల ధర రూ.68,830 స్థాయిని దాటి కొత్త చరిత్ర సృష్టించింది. ఇదే సమయంలో వెండి ధర కేజీకి రూ.75,692 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు మధ్య ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ మెతక వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈ రోజు ఔన్స్‌కి $ 2,259 కొత్త గరిష్ఠ స్థాయిని తాకింది.

స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు $2,233 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ.. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో వెంటనే ఊపందుకున్నాయి. ఇంట్రాడేలో నేడు గరిష్ఠ స్థాయి $2,259ని తాకింది. ఇది బంగారం కోసం కొత్త రికార్డు గరిష్ఠం కావటంతో భారతీయ పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బులియన్ మార్కెట్‌లో గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.67,252 వద్ద ముగిసింది. ఇదే క్రమంలో వెండి కిలో ధర రూ.74,127 వద్ద ముగిసింది.
MCXలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జూన్ 5న 22 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర 1.79 శాతం జంప్‌తో 10 గ్రాములకు రూ.68,914 వద్ద ట్రేడవుతోంది. కాగా మే 3న వెండి ఫ్యూచర్స్ ధర దాదాపు ఒక శాతం పెరిగి కిలో రూ.75,780 వద్ద ఉంది. ప్రస్తుతం పసిడి, వెండి లోహాల ధరలు ర్యాలీపై కేడియా అడ్వైజరీ ప్రెసిడెంట్ అజయ్ కేడియా స్పందిస్తూ త్వరలోనే పసిడి 10 గ్రాముల ధర రూ.70 వేల మార్కును తాకుతుందని అంచనా వేశారు. దీపావళి 2023 కోసం బంగారం ధరలపై తమ అంచనా కొత్త గరిష్టాలను చేరుకుందన్నారు. అది తాము సూచించిన 59,500 స్థాయిల నుంచి 14.28% పైకి పెరిగిందన్నారు. ఏప్రిల్ 01, 2024 నాటికి ధరలు గరిష్టంగా రూ.68,500కి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications