Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రాజకీయ భౌగోళిక పరిస్థితుల మార్పులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో సేఫ్ హెవెన్ అయిన పసిడి ధరలు కూడా సామాన్యులకు అస్సలు అందని స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో 2025లో బంగారం ధర వినియోగదారులకు మింగుడు పడని స్థాయిలకు చేరుకుంది.
వివరాల్లోకి వెళితే బంగారం రేటు చాలా కాలంగా నిపుణులు అంచనా వేసిన ఔన్సుకు 3000 డాలర్ల కీలక మార్కును అధిగమించింది. దీంతో స్పాట్ మార్కెట్లో అధర 3005 డాలర్ల సమీపానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్ రానున్న రోజుల్లో ప్రజలకు అందని ద్రాక్ష స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ కోసం పెట్టుబడిదారులు శుక్రవారం నాడు బంగారంలో చారిత్రాత్మక ర్యాలీకి తరలిరావడంతో బంగారం మొదటిసారిగా 3,000 డాలర్లు విలువైన కీలకమైన అవరోధాన్ని అధిగమించింది. దీంతో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఖరీదైనవిగా మారాయి.

స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సంక్షోభం కారణంగా అంతిమ సురక్షిత ఆస్తి కోసం వెతుకుతున్న ఇన్వెస్టర్లు తమ డబ్బును ప్రస్తుతం బంగారంలోకి తరలిస్తున్నారని మెటల్ వ్యాపారి తాయ్ వాంగ్ అన్నారు. ఇది గోల్డ్ 3000 డాలర్ల మైలురాయిని దాటడానికి కారణమని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయకంగా భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయంలో సురక్షితమైన విలువ నిల్వగా పరిగణించబడుతున్న బులియన్ ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 14% పెరిగింది. దీనికి ట్రంప్ సుంకాల ప్రభావం, స్టాక్ మార్కెట్లలో అమ్మకాలపై ఆందోళనలు కొంతవరకు కారణమయ్యాయని తెలుస్తోంది.
ట్రంప్ రక్షణాత్మక విధానాలు ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. గడచిన వారంలో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో టెక్ కంపెనీల నుంచి ప్రపంచ కుబేరులకు చెందిన వ్యాపార సంస్థలు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీని వల్ల S&P 500 దిద్దుబాటు ప్రాంతంలోకి పడిపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల సంపద దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో మాంద్యంలోకి జారుకుంటుందని ఆందోళనలు సైతం పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పసిడికి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు సైతం కొనుగోళ్లను కొనసాగించటంతో గోల్డ్ డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే రిటైల్ ఆభరణాల మార్కెట్లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కొనసాగుతోంది. ప్రజలు తక్కువ ఆదాయాలతో పెరిగిన పసిడి ధరలతో ప్రస్తుతం కొనుగోళ్లకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications