Gold Prices: అలా బడ్జెట్ రిలీజ్, ఇలా తగ్గిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలివే..
Gold News: ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అదికాస్తా అతివలకు వరంగా మారింది. ఈ నిర్ణయంతో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అడ్డూ, అదుపూ లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలకు కేవలం ఒక్క ప్రకటనతో నిర్మలమ్మ కళ్లెం వేశారని భావిస్తున్నారు.
ఈ దఫా బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దాదాపు 4 వేల మేరకు తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధరలు 72 వేల 838 నుంచి ఒక్కసారిగా 68 వేల 500కి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఔన్సుకు దాదాపు 2 వేల 397 డాలర్లుగా నమోదయ్యాయి.

బడ్జెట్‌లో నిర్ణయం వినియోగదారులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తగ్గించిన దిగుమతి సుంకంలో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) 10 శాతం నుంచి 5 శాతానికి మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) 5 శాతం నుంచి 1 శాతానికి కుదించారు. MCXలో వెండి ధరలు కూడా గణనీయంగా కిలో 88 వేల 995 నుంచి 84 వేల 275కి క్షీణించాయి.
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2 వేల 900 తగ్గి 70 వేల 860కి చేరింది. 22 క్యారెట్లపై కూడా 2 వేల 750 తగ్గింపుతో 64 వేల 950 వద్ద స్థిరపడింది. బంగారం బాటలోనే వెండి కూడా 3 వేల 500 క్షీణించి 88 వేల దిగువకు చేరుకుంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని జ్యూయలరీ దుకాణదారులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications