రూ.50 వేలకు బంగారం ధర దిగి రావాలంటే మీరు ఏం చేయాలి? ఈ పనులు చేస్తే పసిడి రేటు తగ్గి తీరుతుంది..
Gold Rate Rise Reason: బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పసిడి ధరలు లక్ష మార్కును తాకాయి. భారతీయులకు బంగారం పెట్టుబడి ఎప్పుడూ సురక్షిత ఆస్తిగా పరిగణించబడింది. అయితే 2025 తర్వాత బంగారం ధరలు అనేక గ్లోబల్ అంశాలపై ఆధారపడి ఒక్కసారిగా పెరుగుదల చూశాయి. బంగారం ధరలు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ మార్పిడి రేట్లు, వడ్డీ రేట్లు, మార్కెట్ డిమాండ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. భారతదేశం వంటి దేశాలలో బంగారం పెట్టుబడి, ఆభరణాల రూపంలో విస్తృత డిమాండ్ కలిగి ఉండడం వల్ల పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.
అయితే బంగారం ధరలు తగ్గాలంటే ఏమి చేయాలి. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేదా అని మనం విశ్లేషించుకుంటే కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయి. ఈ అంశాలు ప్రభావితం అవ్వడం ద్వారా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి అధిక రిస్క్ కలిగిన ఆస్తులపై దృష్టి సారిస్తే పసిడి ధరలు తగ్గుతాయి. తద్వారా ఇన్వెస్టర్లు బంగారం వంటి సేఫ్ హావెన్ (సురక్షిత పెట్టుబడి) మీద పెట్టుబడులు పెట్టరు. దీని వల్ల పసిడి ధరలు తగ్గుతాయి.దీనికి ఉదాహరణగా చెప్పాలంటే.. స్టాక్ మార్కెట్లు బాగా పెరిగే కాలంలో లేదా పెద్ద ఆర్థిక మాంద్యం సంకేతాలు లేని సమయంలో పెట్టుబడిదారులు పసిడి మీద డబ్బు పెట్టడానికి ఇష్టపడరు. ఇది బంగారం ధరలను తగ్గించడంలో సాయపడుతుంది.

ఇక డాలర్ బంగారం ధరలపై ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి కారణం బంగారం ధర అంతర్జాతీయంగా డాలర్లలో నిర్ణయించబడటంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరిగితే ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు మార్కెట్లో బంగారం ఖరీదైన వస్తువుగా మారుతుంది. దీంతో పెట్టుబడిదారులు దాని మీద ఆసక్తి చూపరు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దీని ఫలితంగా బంగారం ధర పడిపోయే అవకాశం ఉంది.
ఇక మరో అంశం ఏంటంటే.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కూడా బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఈ సమయంలో బంగారాన్ని వదిలేసి బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు వంటి వాటిల్లో పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను పెడతారు. బంగారాన్ని విక్రయించి వడ్డీ ఇచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తారు. ఇది కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా నిలవవచ్చు. ఇంకో అంశం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఉత్పత్తి పెరగడం లేదా కేంద్ర బ్యాంకులు సంక్షోభ సమయంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని మార్కెట్లో అమ్మడం వల్ల దీని సరఫరా పెరుగుతుంది. సరఫరా పెరిగి డిమాండ్ స్థిరంగా ఉంటే బంగారం ధరలు సహజంగానే తగ్గుతాయి.
ప్రపంచ బంగారం మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఉందంటే భారతదేశం, చైనాలే ప్రధాన కారణం.ఈ రెండు దేశాల్లో వివాహాలు, పండుగలు వంటి సీజన్ల సమయంలో ఆభరణాల కొనుగోలు భారీగా ఉంటాయి. దీంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే అవి తగ్గిపోతే ఆటోమేటిగ్గా బంగారం ధరలు కూడా తగ్గుతాయి. ఇక మరో అంశం భారతదేశంలో బంగారం మీద దిగుమతి సుంకాలు తగ్గిస్తే దేశీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దేశం విదేశాల నుండి వచ్చే బంగారం మీద దిగుమతి సుంకాలు తగ్గిస్తే పసిడి దిగుమతులు చౌకగా మారుతాయి. దీనివల్ల దేశీయంగా బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ ప్రభుత్వాలు పసిడి మీద పెట్టుబడులు తగ్గే విధంగా ఆర్థిక విధానాలను అమలు చేస్తే కూడా బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది.
బంగారం ధరలు తగ్గాలంటే పై అంశాలన్నీ కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక స్థితి, డాలర్ మార్పిడి రేటు, వడ్డీ రేట్ల పెంపు, సరఫరా-డిమాండ్, ఆర్థిక వ్యవస్థ బలపడటం, పెట్టుబడిదారుల రిస్క్ ఆపెటైట్ పెరగడం, బంగారం సరఫరా పెరగడం వంటి కారణాలు బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయి. ఇక 2024 చివరలో కొన్ని దేశాలు (చైనా, రష్యా, టర్కీ) డాలర్ రిజర్వులను తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచడంతో ధరలు మరింతగా పెరగడానికి కారణమవుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications