Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ 5 రాష్ట్రాల్లో గోల్డ్ ఎక్కడ కొన్నా ఒకటే ధర.. తెలుగు ప్రజలకు..
Gold Rate: దేశంలోని అనేక రాష్ట్రాల్లో, వివిధ నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండటాయని మనందరికీ తెలుసు. కొన్ని సార్లైతే ఒకే నగరంలో కూడా వేరువేరుగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇకపై ఈ సమస్యకు తెరపడుతోంది. దక్షిణ భారత దేశంలోని ఈ ఐదు రాష్ట్రాల్లో ఇకపై బంగారం ఒకటే రేటుకు దొరకనుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే..

నగరానికో రేటు..
సహజంగా రవాణా ఖర్చులు, టాక్సెస్ తో సహా వివిధ కారణాల వల్ల బంగారం ధర ఒక్కో ప్రదేశానికి కొద్దిగా మార్పులు ఉంటాయి. విజయవాడలో ఒక ధర, నెల్లూరులో ఇంకో ధర, హైదరాబాద్ లో వేరే ధర, వైజాగ్ లో మరో ధర ఉండటానికి ఇదే కారణం. ఈ పరిస్థితిలో ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే ధరకు బంగారాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తమిళనాడులో అత్యధికంగా..
దేశంలో ఏడాదిలో 1,300 టన్నుల బంగారం అమ్ముడవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మెుత్తంలో దాదాపు 30% తమిళనాడులోనే అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బంగారం ధర ఒకేరకంగా ఉండేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుజరాత్ లో గోల్డ్ ఎక్స్ఛేంజ్ పెట్టడం వెనుక ఉన్న కారణాల్లో దేశ వ్యాప్తంగా ఒకటే ధరను తీసుకురావటం కూడా ఒక లక్ష్యంగా ఉంది.

5 రాష్ట్రాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే ధరకు బంగారాన్ని విక్రయించేందుకు జ్యువెలర్స్ అసోసియేషన్ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ప్రముఖ నగల దుకాణం యజమాని మాట్లాడుతూ.. 'ప్రతి జ్యువెలరీ షాపులో ఒక్కో ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని, దీన్ని నివారించేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు వారు తెలిపారు.

కేరళలో సమావేశం..
కేరళలోని కొచ్చిలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ బంగారు ఆభరణాల షాపులను ఒకే ధరకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ షాపు యజమానులు పాల్గొన్నారు. మెుదట కొంత మంది వ్యాపారులు దీనిని వ్యతిరేకించినప్పటికీ చివరికి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. వినియోగదారుల్లో గోల్డ్ ధరల విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఇది ఉపకరిస్తుందని వారు అన్నారు.

తొలి దశలో..
తొలి దశలో ఇది కేవలం 5 రాష్ట్రాలతో ప్రారంభమైనప్పటికీ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వినియోగదారులకు ఎక్కువగా ప్రయోజనం కలగనుంది. ఎక్కడ బంగారం కొన్నా ఒకటే ధర కారణంగా ఎటువంటి శ్రమ, నష్టం లేకుండానే పసిడి ప్రియులు ఎక్కడైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications