బంగారం ముట్టుకుంటేనే భగ్గుమంటోంది. పసిడి ధరలు అయిదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టులో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంటుందా? లేదా మళ్లీ తగ్గుముఖం పడుతుందా అనే దానిపై విశ్లేషకులు అంచనాలు వేసుకుంటున్నారు. దీనికి అనేక రకాలైన కారణాలు కూడా ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి అమెరికా సుంకాలు అమల్లోకి వస్తుండటంతో బంగారం ధరలపై అంచనాలు మొదలయ్యాయి.
వివిధ దేశాలపై అమెరికా విధించిన నూతన వాణిజ్య సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న వార్తల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.డాలర్ విలువ బలహీనపడటం, US బాండ్ దిగుబడి పడిపోవడంతో బంగారం వైపు పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను తరలించారు. దీంతో బంగారం ధర రయ్యిమంటూ దూసుకుపోయింది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు 1.3 శాతం పెరిగి 3,394.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది జూన్ 17 తర్వాత అత్యధిక ధరగా చెప్పుకోవచ్చు. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1.4 శాతం పెరిగి 3,406.40 డాల్లర వద్ద స్థిరపడ్డాయి. ఇదే సమయంలో US డాలర్ ఇండెక్స్ 0.6 శాతం తగ్గింది. ఈ కారణంగా డాలర్‌తో విలువైన Gold.. ఇతర కరెన్సీ ఉపయోగించే కొనుగోలుదారులకు మరింత చవకగా మారింది. బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల US ట్రెజరీ దిగుబడి కూడా ఒక వారం కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఆగస్టు 1వ తేదీ గడువు గ్లోబల్ మార్కెట్‌లో ఒక కొత్త అనిశ్చితిని తెస్తోంది. ఇది బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని హై రిడ్జ్ ఫ్యూచర్స్‌లో లోహాల ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మేగర్ అన్నారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావంతో వివిధ దేశాలతో యుఎస్ వాణిజ్య ఒప్పందం సాధ్యమయ్యే అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్.. అమెరికాపై విస్తృతమైన ప్రతీకార చర్యలను పరిశీలిస్తోందని EU దౌత్యవేత్తలు వెల్లడించారు.
CME ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం.. సెప్టెంబర్‌లో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుకు 59 శాతం అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం, ఫెడరల్ రిజర్వ్‌లో నాయకత్వ మార్పు, పునర్నిర్మాణం వంటి ఊహాగానాలు మార్కెట్‌లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. ఈ అనిశ్చితి కూడా Gold ధరల పెరుగుదలకు కారణం అవుతోంది.
బంగారం సాధారణంగా అనిశ్చిత పరిస్థితుల్లో హెడ్జ్‌గా పనిచేస్తుంది మరియు తక్కువ వడ్డీ రేటు వాతావరణంలో ధరలు పెరుగుతాయి.
దీనికి తోడు చైనా జూన్‌లో 63 మెట్రిక్ టన్నుల Gold దిగుమతి చేసుకుంది. ఇది జనవరి తర్వాత కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆగస్టు 1 వాణిజ్య ఒప్పంద గడువు, వడ్డీ రేట్ల ఊహాగానాలు, డాలర్ బలహీనత వంటి అంశాలు బంగారం ధరను మరింత పెంచే అవకాశాన్ని చూపిస్తున్నాయి. అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.ఒకవేళ సెప్టెంబర్‌లో ఫెడ్ రేటు కోత జరిగితే బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications