బంగారం ధరల పతనంపై పందెం.. 20 నిమిషాల్లో రూ.2000 కోట్ల భారీ డీల్.. అసలేం జరిగింది..
ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సరికొత్త గరిష్ఠాలను తాకుతుంటే.. మరోవైపు మార్కెట్లో చోటుచేసుకున్న ఒక అత్యంత భారీ ట్రేడింగ్ లావాదేవీ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆసక్తిని, సందేహాలను రేకెత్తిస్తోంది. సోమవారం మార్కెట్ ప్రారంభమైన కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఒక ప్రముఖ వ్యాపారి బంగారం ఈటీఎఫ్ ఆధారంగా ఏకంగా రూ. 1,919 కోట్ల రూపాయలతో అత్యంత క్లిష్టమైన ఆప్షన్స్ పందెం వేయడం వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ప్రపంచవ్యాప్తంగా Gold ధరలు మరింత పెరుగుతాయని సామాన్య ఇన్వెస్టర్లు భావిస్తున్న సమయంలో.. రాబోయే కొన్ని వారాల్లో ధరల్లో తాత్కాలిక క్షీణత లేదా పతనం తప్పదని భావిస్తూ ఈ బేరిష్ వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రస్తుత బంగారం ర్యాలీని గమనించాలి. ఈ ఒక్క నెలలోనే బంగారం ఏకంగా పదిహేను శాతం వరకు రాబడిని అందించి.. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యుత్తమ నెలవారీ ప్రదర్శన దిశగా సాగుతోంది.

సాధారణంగా అమెరికా బాండ్ దిగుబడులు, వాస్తవ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, వడ్డీ రాబడి లేని బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతాయి. కానీ ప్రస్తుతం బాండ్ దిగుబడులు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడం ఒక వింత ధోరణిగా మారింది. ఈ ఊపును చూసి సాధారణ వ్యాపారులు కొనుగోలు వైపు పరుగులు తీస్తుండగా.. స్మార్ట్ మనీ అని పిలవబడే బడా సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం తమ లాభాలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.
సోమవారం ఉదయం జరిగిన లావాదేవీలో.. సదరు వ్యాపారి ఎస్‌పిడిఆర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్‌కు చెందిన డాలర్ వ్యాల్యూలోని కాంట్రాక్టులపై సుమారు లక్షా పదహారు వేల కాల్ ఆప్షన్లను విక్రయించారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువగా ఉన్న 420 డాలర్ల స్ట్రైక్ ప్రైస్ వద్ద ఆప్షన్లను అమ్మడం ద్వారా ఆయన రూ. 1,919 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని పొందారు. అదే సమయంలో ప్రమాదాన్ని నివారించేందుకు.. 430 డాలర్ల స్ట్రైక్ ప్రైస్ కలిగిన అంతే సంఖ్యలో ఉన్న కాల్ ఆప్షన్లను రూ. 1,368 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ రెండింటి వ్యత్యాసంగా ఆయన జేబులోకి నికరంగా రూ. 551 కోట్ల క్రెడిట్ నికర లాభంగా చేరింది.
ఈ వ్యూహంలో 425 డాలర్లు బ్రేక్-ఈవెన్ పాయింట్‌గా ఉంది. అంటే ఎక్స్‌పైరీ నాటికి ఈటీఎఫ్ ధర అంతకంటే తక్కువకు పడిపోతే ఆ వ్యాపారికి సంపూర్ణ లాభం లభిస్తుంది. ఒకవేళ ధర అంతకంటే పెరిగి 430 డాలర్లు దాటితే గరిష్టంగా రూ. రూ. 551 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ధరలు వేగంగా పెరిగిన తర్వాత కొంత నెమ్మదించడం సహజమని, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఈ తిరోగమనం సంభవిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా రాబోయే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఆర్థిక విధాన సమావేశాలు బాండ్ దిగుబడులను పెంచి బంగారానికి ప్రతికూలంగా మారవచ్చనే అంచనాలు కూడా ఈ పందెం వెనుక ఉన్నాయి.
ఏది ఏమైనా Gold ర్యాలీ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేము. చాలా మంది ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న భారీ భౌతిక బంగారానికి భద్రత కల్పించే 'హెడ్జింగ్' ప్రక్రియలో భాగంగా కూడా ఇలాంటి ఆప్షన్స్ స్ప్రెడ్స్ ఉపయోగిస్తుంటారు. ఎక్స్‌పైరీ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ డీల్ ఫలితం ఏమిటనేది తేలనుంది. పెరిగిన ధరలను నమ్ముతున్న సాధారణ ఇన్వెస్టర్లు గెలుస్తారా లేక కేవలం ఇరవై నిమిషాల్లోనే రూ. 1,919 కోట్ల లావాదేవీ జరిపిన ఆ రహస్య వ్యాపారి అంచనా నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
