Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా లేదా ఉద్రిక్తతలు పెరిగినా ఇన్వెస్టర్ల మొదటి ఛాయిస్ బంగారమే. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు అందరూ మొగ్గు చూపుతారు. దాంతో వెంటనే బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా, ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్నా బంగారం ధరలు (Gold Prices) ఆశించిన స్థాయిలో పెరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2026 మార్చి నాటికి బంగారం మార్కెట్లో ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది.

ప్రపంచ ఉద్రిక్తతలున్నా నిలకడగానే ధరలు
బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం, వెండి ధరలు కొంత బలహీనంగానే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,000 వద్ద ట్రేడ్ అవుతుండగా.. కేవలం 0.01 శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. వెండి ధర కూడా రూ. 2,53,870 వద్ద నిలకడగా ఉంది. సాధారణంగా ఇటువంటి సమయంలో ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ, మార్కెట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచి చూడటమే.
బంగారం దూకుడుకు బ్రేక్ వేస్తున్న డాలర్!
బంగారం ధరలు (Gold Prices) పెరగకపోవడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలోపేతం కావడం. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరిగినప్పుడు, ఇన్వెస్టర్లు కేవలం బంగారం వైపే కాకుండా డాలర్ వైపు కూడా చూస్తున్నారు. డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం కొనడం భారమవుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికా వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్లు లాభసాటిగా కనిపిస్తాయి. దీనివల్ల వడ్డీ లేని బంగారంపై ఆసక్తి తగ్గుతుంది.
ప్రాఫిట్ బుకింగ్, ఇతర మార్గాలు
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాలను స్వీకరించే (Profit Booking) పనిలో ఉన్నారు. కొత్తగా కొనేకంటే ఉన్నదాన్ని అమ్మి లాభాలు పొందాలని చూస్తున్నారు. అలాగే, ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందు కేవలం బంగారం మాత్రమే కాకుండా యూఎస్ ట్రెజరీ బాండ్లు, క్యాష్ పొజిషన్స్ వంటి ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. దీనివల్ల గతంలో కేవలం బంగారం వైపు వెళ్లే పెట్టుబడులు ఇప్పుడు వివిధ మార్గాలకు మళ్లుతున్నాయి.
నిపుణుల విశ్లేషణ: ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మార్కెట్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. బంగారం ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉంది. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్. ప్రకారం, "ఎంసీఎక్స్ గోల్డ్ ప్రస్తుతం రూ. 1,55,000 పైన ట్రేడ్ అవుతోంది. రూ. 1,54,000 నుండి రూ. 1,55,000 మధ్య బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఒకవేళ ధర రూ. 1,58,000 దాటితే, అది రూ. 1,60,000 మార్కును తాకే అవకాశం ఉంది."
ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రెసివ్‌గా బంగారం కొనడం కంటే, ధరలు కొంచెం తగ్గినప్పుడు (Dips) నెమ్మదిగా పెట్టుబడి పెట్టడం మంచిది. మీ పోర్ట్‌ఫోలియోలో బంగారంతో పాటు ఇతర పెట్టుబడులు కూడా ఉండేలా చూసుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.


Click it and Unblock the Notifications