బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory
బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఓ స్థాయిని దాటి పెరిగిన పసిడి ధరలు రానున్న కాలంలో ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
తాజాగా Kedia Advisory విడుదల చేసిన నివేదిక బంగారం ధరల చరిత్రను సుమారు 800 సంవత్సరాల విస్తృత కాలపరిమితిలో విశ్లేషిస్తూ, బంగారం ఎందుకు తరతరాలుగా అత్యంత విశ్వసనీయమైన సంపద రక్షణ సాధనంగా నిలిచిందో స్పష్టంగా వివరిస్తుంది. ప్రభుత్వ డిఫాల్ట్‌లు, యుద్ధాలు, కరెన్సీ విలువ తగ్గింపులు, ఆర్థిక అస్థిరత వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతీసారి బంగారం విలువ పెరిగినట్లు ఈ అధ్యయనం చూపిస్తోంది.
1200-1300 మధ్యకాలంలో యూరప్‌లో బంగారు నాణేలు తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చాయి. క్రూసేడ్లు, అరబ్ దేశాలతో వాణిజ్యం బంగారానికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తీసుకువచ్చాయి. ఫ్లోరెన్స్ ఫ్లోరిన్, వెనీషియన్ డ్యూకాట్ వంటి నాణేలు అప్పట్లో గ్లోబల్ కరెన్సీలుగా నిలిచాయి. హెన్రీ III కాలంలో బంగారం ధర సుమారు 4.1 డాలర్లుగా ఉండటం అప్పటి ఆర్థిక వ్యవస్థలో దాని స్థిరత్వాన్ని సూచిస్తుంది.

1300 నుంచి 1500 మధ్య యూరప్‌లో శతాబ్దాల యుద్ధాలు, కరెన్సీ డిబేస్‌మెంట్ Gold ధరలను మెల్లగా పైకి నెట్టాయి. ముఖ్యంగా ఎడ్వర్డ్ III, హెన్రీ IV, ఎడ్వర్డ్ IV పాలనలో జరిగిన కరెన్సీ విలువ తగ్గింపులు బంగారాన్ని నమ్మదగిన నిల్వగా మార్చాయి. 1500-1600 కాలంలో రైతు యుద్ధాలు, హెన్రీ VIII కాలంలోని గ్రేట్ డిబేస్‌మెంట్ బంగారం ధరల పెరుగుదలకు మరింత బలం చేకూర్చాయి.
ఇక 1600-1700 మధ్య 30 ఏళ్ల యుద్ధం, రాజకీయ మార్పులు, కరెన్సీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్థాపనతో కాగితపు కరెన్సీకి శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ.. కరెన్సీపై అనిశ్చితి పెరిగిన ప్రతిసారి Gold విలువ పెరుగుతూనే వచ్చింది. 1700-1800 కాలంలో బంగారానికి చట్టబద్ధమైన టెండర్ హోదా లభించడం, గోల్డ్ స్టాండర్డ్ అమలు కావడం దాని ప్రాముఖ్యతను మరింతగా పెంచాయి. నెపోలియన్ యుద్ధాల సమయంలో కూడా బంగారం ధరలు బలంగా నిలిచాయి.
1800-1900 కాలంలో బంగారు ప్రమాణం.. బైమెటాలిక్ వ్యవస్థల కారణంగా ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. అయితే అమెరికన్ సివిల్ వార్ వంటి సంఘటనలు తాత్కాలిక ఊగిసలాటలకు కారణమయ్యాయి. 1900 నుంచి 1971 వరకు ప్రపంచ యుద్ధాలు, బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ బంగారం ధరలను నియంత్రిత స్థాయిలో ఉంచాయి. ఈ కాలంలో ఔన్సుకు సుమారు 20 డాలర్ల చుట్టూ ధర నిలిచింది.
అసలైన మలుపు 1971లో వచ్చింది. బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ ముగియడంతో US డాలర్ ఫియట్ కరెన్సీగా మారింది. 1970ల స్టాగ్‌ఫ్లేషన్, అధిక ద్రవ్యోల్బణం బంగారం ధరలను ఆకాశానికి ఎత్తాయి. 1980లో ఔన్సుకు సుమారు 909 డాలర్ల వరకు చేరడం చరిత్రలో కీలక ఘట్టం. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత బంగారం మరోసారి బలంగా పైకి ఎగసింది.
2000-2026 కాలానికి సంబంధించిన చార్ట్ ప్రకారం.. నిరంతర ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్‌లో ఉంది. నివేదిక అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ధర ఔన్సుకు సుమారు 5,100 డాలర్ల స్థాయికి చేరే అవకాశముంది. ముఖ్యంగా BRICS దేశాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు డాలర్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచుతున్నాయి.
క్లుప్తంగా కేడియా నివేదిక చెప్పేది ఒక్కటే.. చరిత్ర బంగారం వైపే మొగ్గు చూపుతోంది. అప్పు భారాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, యుద్ధాలు, వాణిజ్య ఘర్షణలు కొనసాగుతున్న ఈ కాలంలో బంగారం భవిష్యత్తులోనూ సురక్షిత పెట్టుబడిగా తన స్థానాన్ని మరింత బలపరచనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications