బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..
ఏప్రిల్ నెలలో బంగారం ధరల గమనంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, పెట్టుబడిదారులు ఇప్పుడు వడ్డీ రేట్ల మార్పులు, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు భారీ ర్యాలీని కొనసాగించాయి.
ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో Gold ధర 1.7 శాతం మేర పెరిగి ఔన్సుకు 4,700 డాలర్ల మార్కును దాటింది. ఒకానొక దశలో ఇది 3.5 శాతం వరకు పెరిగినప్పటికీ, ఆ తర్వాత స్వల్పంగా లాభాలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించినట్లు వెలువడిన వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

అమెరికా డాలర్ విలువ వరుసగా రెండో రోజు క్షీణించడం కూడా బంగారానికి కలిసి వచ్చింది. డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీలు ఉన్న వారికి Gold కొనుగోలు చౌకగా మారుతుంది, తద్వారా డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ 2.2 శాతం పెరిగి ఔన్సుకు 4,774.25 డాలర్ల వద్ద నిలిచింది. ఇది గత రెండు వారాల్లోనే అత్యధిక స్థాయి.ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ మార్పులే అని చెప్పవచ్చు.
మార్చి నెలలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పై ఆందోళనలు కలగడంతో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని భావించి బంగారం ధరలు 11 శాతం వరకు పడిపోయాయి. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పుడు రాబడి ఇవ్వని బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపరు. అయితే ఇప్పుడు యుద్ధం ముగింపు దశకు వచ్చిందన్న వార్తలతో, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని మార్కెట్ ఆశిస్తోంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని.. అది బంగారానికి మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధరల విశ్లేషణను గమనిస్తే.. మార్కెట్ నిపుణులు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌జెఓ ఫ్యూచర్స్ స్ట్రాటజిస్ట్ బాబ్ హేబర్‌కార్న్ అభిప్రాయం ప్రకారం.. ఉద్రిక్తతలు సడలి వడ్డీ రేట్ల కోత అంచనాలు పెరిగితే బంగారం ధరలు ఔన్సుకు 5వేల డాలర్ల మార్కును కూడా చేరవచ్చు. అయితే, ఐజీ మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకమోర్ దీనిని రెండు వైపులా పదునున్న కత్తిగా వర్ణించారు. యుద్ధం ముగిస్తే ఒకవైపు 'సురక్షిత ఆశ్రయం' (Safe Haven)గా బంగారానికి ఉన్న క్రేజ్ తగ్గుతుంది, కానీ మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గి వడ్డీ రేట్లు తగ్గితే అది ధరలకు ఊతాన్నిస్తుంది అంటున్నారు.
ఏదేమైనా ఏప్రిల్ నెలలో బంగారం ధరలు ఇరాన్ సరిహద్దుల్లోని శాంతి ప్రక్రియ, అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉండనున్నాయి. హార్ముజ్ జలసంధిలో రాకపోకలు పునరుద్ధరించబడి, ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వడమే కాకుండా బంగారం మార్కెట్‌లో సరికొత్త రికార్డులకు దారితీయవచ్చు. పెట్టుబడిదారులు ప్రస్తుతం యుద్ధం తాలూకు పరిణామాలను, ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నారు.


Click it and Unblock the Notifications