బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన మంగళవారం గడువు సమీపిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. యుద్ధం సంభవిస్తుందా లేదా చర్చల ద్వారా శాంతి నెలకొంటుందా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
స్పాట్ గోల్డ్ ధర 0.42 శాతం తగ్గి ఔన్సుకు $4,656.21 వద్ద స్థిరపడింది. కేవలం వార్తా సంస్థల శీర్షికలను నమ్మి పెట్టుబడులు పెట్టలేమని, ట్రంప్, ఇరాన్ వైఖరిలో నిరంతరం మార్పులు వస్తుండటమే ఈ అనిశ్చితికి ప్రధాన కారణమని చికాగోలోని FHN ఫైనాన్షియల్ మాక్రో స్ట్రాటజిస్ట్ విల్ కాంపెర్నోల్ అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి యుద్ధం, వడ్డీ రేట్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఒకవేళ ఇరాన్‌తో సంఘర్షణ గనుక కొనసాగితే, చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది సహజంగానే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే బంగారానికి డిమాండ్ పెరగాలి, కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది.
ద్రవ్యోల్బణం పెరిగితే దానిని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. పైగా, ఇంధన ధరలు పెరిగితే అధిక వడ్డీ రేట్లను మరికొంత కాలం కొనసాగించాలనే చర్చ మొదలవుతుంది. Gold ఎలాంటి వడ్డీని ఇచ్చే ఆస్తి కాదు కాబట్టి, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర లాభదాయక మార్గాల వైపు మొగ్గు చూపుతారు, ఇది బంగారం ధరలకు ప్రతికూలంగా మారుతుందని టీడీ సెక్యూరిటీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ కమోడిటీ స్ట్రాటజీ బార్ట్ మెలెక్ అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడిలో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల బాండ్ రాబడి 4.341 శాతానికి, 30 ఏళ్ల బాండ్ రాబడి 4.894 శాతానికి చేరాయి. ఫెడ్‌వాచ్ టూల్ గణాంకాల ప్రకారం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని మెజారిటీ ట్రేడర్లు భావిస్తున్నారు. ఇది బంగారం ధరలు పెరగకుండా అడ్డుకట్ట వేస్తోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా ఇతర విలువైన లోహాలైన వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా 0.3 శాతం నుండి 1.1 శాతం వరకు క్షీణించాయి. వెండి ధర ప్రస్తుతం ఔన్సుకు $72.81 వద్ద కొనసాగుతోంది.
పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం యుద్ధ గడువు కోసమే కాకుండా, రాబోయే కొన్ని కీలక ఆర్థిక గణాంకాల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. బుధవారం వెలువడనున్న ఫెడ్ మార్చి సమావేశ వివరాలు, గురువారం నాటి యూఎస్ వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) డేటా, శుక్రవారం నాటి వినియోగదారుల ధరల సూచిక (CPI) నివేదికలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.
భౌగోళిక రాజకీయ ముప్పుల నుండి రక్షణ కవచంగా బంగారాన్ని భావించినప్పటికీ, వడ్డీ రేట్ల భయం దాని ఆకర్షణను తగ్గిస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటల గడువు తర్వాత ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపైనే బంగారం ధరల తదుపరి గమనం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ యుద్ధం తప్పనిసరైతే ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది, లేనిపక్షంలో స్థిరంగా కొనసాగవచ్చు.


Click it and Unblock the Notifications