మరో 4 నెలల్లో రూ. 2 లక్షలకు బంగారం ధర.. సంచలన నివేదికను విడుదల చేసిన UBS..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగబోతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మరో ఆరు నెలల పాటు ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయని..దీంతో బంగారం ధరలు చుక్కలు తాకడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్-అమెరికా మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటోంది.
ఈ నేపథ్యంలోనే 2026 నాటికి బంగారం మరోసారి చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కలిసి బంగారాన్ని బలమైన ర్యాలీ వైపు నడిపిస్తున్నాయని చెబుతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ UBS విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 మధ్య నాటికి బంగారం ఔన్సుకు 6,200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది 10 గ్రాములకు దాదాపు రూ. లక్షా 98 వేల నుంచి రూ. 2 లక్షల స్థాయికి సమానం. అంటే రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లోనే Gold ధరలు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బంగారం ధరలకు ప్రధాన మద్దతు ఇస్తున్న అంశాల్లో మొదటిది కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. UBS అంచనా ప్రకారం.. 2025లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సుమారు 863 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లు 2026 నాటికి 950 టన్నులకు చేరవచ్చని అంచనా. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నాయి.
World Gold Council (WGC) గణాంకాల ప్రకారం.. 2025లో ప్రపంచ బంగారు డిమాండ్ తొలిసారిగా 5 వేల మెట్రిక్ టన్నులను దాటింది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆదాయాలు, పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా ఆభరణాల డిమాండ్ బలంగా కొనసాగుతోంది. మరోవైపు బంగారం సరఫరా మాత్రం పెద్దగా పెరగడం లేదు. వుడ్ మెకెంజీ అంచనాల ప్రకారం.. 2028 నాటికి దాదాపు 80 గనులు తమ ప్రస్తుత ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అంటే డిమాండ్ పెరుగుతున్నా, సరఫరా పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారానికి బలమైన మద్దతు ఇస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సైనిక మోహరింపులు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు నడిపిస్తున్నాయి. అటువంటి సందర్భాల్లో Gold ఎప్పుడూ సేఫ్ హెవెన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం కూడా ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా బలపడుతున్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కూడా బంగారం ధరలకు అనుకూలంగా ఉన్నాయి. UBS అంచనా ప్రకారం.. 2025 చివరినాటికి లేదా 2026 ప్రారంభంలో ఫెడ్ రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల రేటు కోతలు చేయవచ్చు. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడుతుంది, నిజమైన దిగుబడులు తగ్గుతాయి. ఇది సాధారణంగా బంగారానికి లాభదాయకంగా మారుతుంది.
UBS అంచనా ప్రకారం.. 2026 మధ్య నాటికి బంగారం ఔన్సుకు 6,200 డాలర్ల వరకు చేరవచ్చు. ఆ తరువాత కొంత లాభాల స్వీకరణ కారణంగా సంవత్సరం చివర్లో ధరలు 5,900 డాలర్ల చుట్టూ స్థిరపడే అవకాశం ఉంది. అయినప్పటికీ, బలమైన డిమాండ్, పరిమిత సరఫరా, వడ్డీ రేటు కోతలు మరియు ప్రపంచ అనిశ్చితి అన్నీకలిపి చూస్తే 2026లో బంగారం పెట్టుబడిదారులకు గణనీయమైన లాభాలు అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications