Gold price: బంగారం ధర ఎందుకు నెమ్మదించింది? భారీ పెరుగుదల ఉంటుందా లేక తగ్గుతుందా?
ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు (Gold price) అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకరోజు పెరగడం, మరుసటి రోజు స్వల్పంగా తగ్గడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో సందిగ్ధాన్ని పెంచుతున్నాయి. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర రూ. 1,54,422 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే వెండి కూడా రూ. 2,52,548 వద్ద కొనసాగుతోంది. అయితే ధరలు పెరిగినప్పటికీ, గతంలో ఉన్నంత వేగం (Momentum) ఇప్పుడు కనిపించడం లేదు.

ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం
బంగారం ధరలు ఇటీవల బాగా పెరగడంతో, చాలామంది ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకునేందుకు (Profit Booking) ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు గరిష్ట స్థాయికి చేరిన ప్రతిసారీ విక్రయాలు పెరగడం వల్ల ధర మరింత పైకి వెళ్లకుండా అడ్డుకట్ట పడుతోంది. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కోమెక్స్ (COMEX) గోల్డ్ ప్రస్తుతం 4,800 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. అక్కడ 4,850 డాలర్ల వద్ద ఒక బలమైన రెసిస్టెన్స్ ఉండటంతో ధరలు అంతకు మించి పెరగడం కష్టంగా మారుతోంది.
గ్లోబల్ మార్కెట్ సంకేతాలు
అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు, , క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వంటివి పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. భూ రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం బంగారం ధరలు (Gold price) ఒక నిర్ణీత పరిధిలోనే (Range-bound) తిరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగారం ధర రూ. 1,52,500 నుండి రూ. 1,56,000 మధ్య ఊగిసలాడవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ విలువలో మార్పులు , భౌగోళిక రాజకీయ పరిణామాలు తదుపరి భారీ కదలికను నిర్ణయిస్తాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
పెట్టుబడిదారులు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబించడం ఉత్తమం. ధరలు భారీగా పెరగడం లేదు అలాగని భారీగా పడిపోవడం లేదు. మార్కెట్ ఒక స్పష్టమైన దిశ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టకుండా, ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచి వ్యూహం కావచ్చు. అలాగే అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడి మార్గమే అయినప్పటికీ, స్వల్పకాలిక ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని అడుగు వేయడం శ్రేయస్కరం.
ఏదేమైనా అంతర్జాతీయ పరిస్థితులతో పాటు మన దేశీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడినప్పుడు, దిగుమతి చేసుకునే బంగారం ఖరీదు పెరుగుతుంది, ఇది నేరుగా వినియోగదారులపై భారాన్ని మోపుతుంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, తమ డబ్బు విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి చాలామంది సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.


Click it and Unblock the Notifications