బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చుతున్న దిగ్గజ సంస్థలు.. పసిడి ధర తులం రూ. 2 లక్షలకు త్వరలో..
అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఆకస్మిక మార్పులు, ఆర్థిక అనిశ్చితులు పసిడి ప్రియులను, ఇన్వెస్టర్లను మళ్లీ బంగారం వైపు నడిపిస్తున్నాయి. డాలర్ సూచీ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు తగ్గడం, ఆ దేశ రుణ భారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే Gold డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. గడిచిన వారం రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర దాదాపు 5 శాతం మేర పుంజుకుంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో భారతదేశంలో కూడా పసిడి ధరలు అదే బాటలో పయనిస్తూ మళ్లీ రికార్డు స్థాయి వైపు అడుగులు వేస్తున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు దాదాపు 5,600 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తర్వాత.. Gold ధరలు కొంతకాలం తీవ్రమైన దిద్దుబాటుకు (Correction) గురయ్యాయి. అయితే, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ ర్యాలీ మరిన్ని కొత్త రికార్డులకు దారితీస్తుందా లేక మళ్లీ ధరలు తగ్గుముఖం పడతాయా అనే చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ట్రెజరీ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పవచ్చు. 10 నుండి 30 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ప్రభుత్వ బాండ్లకు ద్రవ్య లభ్యతను పెంచేందుకు.. బాండ్ బైబ్యాక్‌ల పరిమాణాన్ని కనీసం రెట్టింపు చేస్తామని యూఎస్ ట్రెజరీ ప్రకటించింది. దీనివల్ల ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడంతో పాటు డాలర్ సూచీ క్షీణించింది. ఇది బంగారం కొనుగోళ్లకు విపరీతంగా మద్దతునిచ్చింది.

మరోవైపు అమెరికా మొత్తం ప్రభుత్వ అప్పు.. చరిత్రలోనే తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న రుణ భారం, వడ్డీ చెల్లింపుల వల్ల డాలర్‌పై నమ్మకం సడలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్, అమెరికా ట్రెజరీలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ తమ రిజర్వుల్లో బంగారు నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏకంగా 89 శాతం సెంట్రల్ బ్యాంకులు రాబోయే ఏడాదిలో తమ పసిడి నిల్వలను మరింత పెంచుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
యుబిఎస్ (UBS) నివేదిక ప్రకారం రాబోయే 12 నెలల్లో బంగారం ఔన్సుకు 5,400 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తుండగా.. మోర్గాన్ స్టాన్లీ, జేపీమోర్గాన్ సంస్థలు 2027 నాటికి ఔన్సుకు 5 వేల డాలర్ల మార్కును అధిగమిస్తుందని చెబుతున్నాయి. ఈ గ్లోబల్ అంచనాలు నిజమైతే.. మన దేశంలో ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువ, దిగుమతి సుంకాల ప్రభావం కలిసి భారతీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సునాయాసంగా రూ. 2 లక్షల మార్కుకు చేరే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
అయితే ఈ ప్రయాణం అంత సులభంగా ఉండకపోవచ్చు. పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగితే.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలో ఆలస్యం చేయవచ్చు. ఇది బాండ్ దిగుబడులను పెంచి.. వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై ఒత్తిడిని తీసుకురావచ్చు. అలాగే, స్వల్పకాలంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) పాల్పడితే ధరల్లో స్వల్ప దిద్దుబాటు రావచ్చు. ఏదేమైనా, సురక్షితమైన ఆస్తిగా బంగారంకున్న ఆదరణ దీర్ఘకాలంలో దాని రూ. 2 లక్షల లక్ష్యానికి గట్టి పునాది వేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
