బంగారం ధర ఏడాది చివరకు రూ. 1.25 లక్షలకు.. సరికొత్త అంచనాను విడుదల చేసిన గోల్డ్‌మన్ సాక్స్..
Gold Price Outlook: ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల సరళి, భౌగోళిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ (Goldman Sachs) రాబోయే 2026, 2027 సంవత్సరాలకు సంబంధించి తమ బంగారం ధరల అంచనాలను సవరించి తగ్గించింది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) కఠినమైన వడ్డీ రేట్ల వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉండటం.. డిసెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, వడ్డీ రేట్ల కోత ప్రక్రియ 2027 చివరి నాటికి వాయిదా పడవచ్చనే వార్తలు అంతర్జాతీయంగా పసిడిపై ఒత్తిడిని పెంచాయి. అయినప్పటికీ ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు జరుపుతున్న భారీ కొనుగోళ్ల మద్దతుతో 2027 చివరి నాటికి బంగారం ధరలు సుమారు 15 శాతం వరకు పుంజుకోగలవని ఈ ఆర్థిక దిగ్గజం అంచనా వేస్తోంది.

గోల్డ్‌మన్ సాక్స్ అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ట్రాయ్ ఔన్సు (సుమారు 31.1 గ్రాములు) ప్రాతిపదికన 2026 చివరి నాటి పసిడి లక్ష్యాన్ని $4,650 డాలర్ల నుండి $4,150 డాలర్లకు తగ్గించింది. అలాగే 2027 చివరి నాటి అంచనాను కూడా $5,400 డాలర్ల నుండి $4,800 డాలర్లకు సవరించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటును రూ. 94 గా లెక్కిస్తే.. భారతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం 2026 నాటి పాత లక్ష్యం రూ. 1.40 లక్షలు ఉండగా.. కొత్త సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 1.25 లక్షలకు తగ్గనుంది.
అలాగే 2027 నాటి పాత లక్ష్యం రూ. 1.63 లక్షలు ఉండగా, కొత్తగా సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 1.45 లక్షలకు చేరనుంది. ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1.46 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. పన్నులు, సుంకాలు, రూపాయి మారకం సెంటిమెంట్ వల్ల దేశీయంగా స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.
ఈ పతనానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లు వడ్డీని చెల్లించని బంగారం నుండి డబ్బు ఉపసంహరించి, బాండ్లు, బ్యాంక్ డిపాజిట్ల వైపు మళ్లుతారు, దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల డాలర్ బలోపేతమై ఇతర దేశాల కొనుగోలుదారులకు పసిడి ప్రియంగా మారుతుంది. అయితే, ప్రపంచదేశాల సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల భద్రత కోసం ప్రతినెలా సుమారు 60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, ఈ భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇచ్చి 2027 చివరి నాటికి ధరలు 15 శాతం పెరగడానికి తోడ్పడతాయని గోల్డ్‌మన్ సాక్స్ స్పష్టం చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
