బంగారం ధరలపై గోల్డ్‌మన్ సాచ్స్ షాకింగ్ నివేదిక..ధంతేరస్, దీపావళికి పసిడి కొనుగోలు చేసేవారికి బిగ్ అలర్ట్
ఈ ఏడాది బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్సుకు 3,600 డాలర్లకి చేరడం పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది బంగారం ధర 4,500 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని సూచించింది. భారతదేశంలో రూ. 1.45 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. నిపుణుల ప్రకారం దీపావళి నాడు Gold 10 గ్రాముల ధర 1.25 లక్షలకు చేరవచ్చని అంచనా.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో, దేశీయ బులియన్ మార్కెట్లలో కూడా ధరలు సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. మంగళవారం ఢిల్లీలో Gold ధర రూ.1,12,750కి చేరగా, వెండి ధర కిలోకు రూ.1,28,800కి చేరింది. జనవరి నుండి ఈ సంవత్సరం బంగారం ధర 35శాతానికి పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణింపబడుతోంది. US ఫెడరల్ రిజర్వ్‌పై వడ్డీ రేట్లు తగ్గించాలనే ఒత్తిడి, డాలర్ పట్ల తక్కువ నమ్మకం వంటి పరిస్థితులు పెట్టుబడిదారులను US ట్రెజరీ నుండి బంగారంలోకి మార్చాయి. అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోలులో ముందంజలో ఉన్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు గత ఐదు సంవత్సరాల సగటు కంటే 24 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. చైనా, పోలాండ్ వంటి దేశాలు ఈ కొనుగోళ్లలో ముందంజలో ఉన్నాయి.
ప్రస్తుతం బంగారం ధర వెండి ధర కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. సాధారణంగా బంగారం.. వెండి ధర కంటే 40-60 రెట్లు ఖరీదైనది, కానీ ప్రస్తుతం ఈ అసమతుల్యత పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వెండి ధర కూడా త్వరలో పెరుగుతుందనడం కూడా వాస్తవమే. భారతదేశంలో పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గోల్డ్ ETFలలో నెలవారీ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. పండుగల సమీపంలో లక్షలు దాటిన బంగారు ఆభరణాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. డాలర్-రూపాయి మార్పిడి అస్థిరత బంగారం ధరలకు మద్దతు ఇస్తోంది.
నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే నెలల్లో బంగారం ధర రూ. 1,45,000 నుంచి 1,55,000 మధ్య, వెండి ధర రూ. 1,35,000 నుంచి 1,50,000 వరకు చేరవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో, బంగారం పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ పెరుగుదల భారతీయ పండుగల సీజన్‌లో ధంతేరస్, దీపావళి సందర్భంలో బంగారం కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications