పసిడి ప్రియులకు బిగ్ షాక్.. తులం బంగారం ధర రూ.1.94 లక్షలు పైమాటే అంటున్న Goldman Sachs
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ.. దీర్ఘకాలంలో Gold కొనుగోళ్ల ఉత్సాహం తగ్గేదేలేదని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ స్పష్టం చేసింది. 2027 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ట్రాయ్ ఔన్సుకు 5,400 డాలర్ల మార్కును చేరుకోవచ్చని తన తాజా రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. స్వల్పకాలంలో వడ్డీ రేట్ల పెంపు వల్ల పసిడి పరుగు కొంత నెమ్మదించినా.. దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ అలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం 5,400 డాలర్లకి చేరి.. రూపాయి మార్పిడి విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 96 వద్ద స్థిరపడితే, భారత్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు (తులం) సుమారు రూ. 1.94 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఒక ట్రాయ్ ఔన్స్ అనగా 31.1035 గ్రాములు కాగా, 5,400 డాలర్లని రూ. 96 తో గుణిస్తే ఒక ఔన్స్ ధర రూ. 5,18,400 అవుతుంది. దీనిని 10 గ్రాములకు లెక్కిస్తే రూ. 1,66,670 వస్తుంది.

అయితే ఇది కేవలం కరెన్సీ పరివర్తన మాత్రమే కాగా.. దీనికి దిగుమతి సుంకాలు, జీఎస్టీ, డీలర్ ప్రీమియంలు, స్థానిక వ్యత్యాసాలను జోడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1.52 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ ధర 4,240 డాలర్ల వద్ద ఉన్నప్పుడు నమోదైన ఈ స్థాయి నుండి 5,400 డాలర్ల లక్ష్యం అనేది 27.4 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇదే 27.4% పెంపును ప్రస్తుత దేశీయ Gold ధర రూ. 1,52,000 కు వర్తింపజేస్తే భారత్‌లో తుది ధర సుమారు రూ. 1,93,600 లేదా రూ. 1.94 లక్షలు అవుతుంది.
సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకులు, ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగి ఇన్వెస్టర్లు బంగారం వైపు నుండి బాండ్ల వైపు మళ్లుతారు. దీనివల్ల బంగారం ధర పడిపోవాల్సి ఉంటుంది. గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ప్రకారం ఫెడ్ మరో మూడు సార్లు రేట్లు పెంచితే Gold ధర తాత్కాలికంగా ఔన్సుకు 4,070 డాలర్లకి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ పతనంలో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, డాలర్‌పై మాత్రమే ఆధారపడకుండా తమ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచాలనే ఆలోచనతో రష్యా, చైనా వంటి అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని పోగుచేస్తుండటమే దీనికి ప్రధాన బలంగా నిలుస్తోంది.
అయితే భారతీయ మార్కెట్లలో తుది ధర అనేది కేవలం అంతర్జాతీయ రేట్లపైనే కాకుండా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. 5,400 డాలర్ల వద్ద బంగారం ఉన్నప్పుడు రూపాయి రూ.90 కి బలపడితే భారత్‌లో ధర రూ. 1.94 లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది, అదే డాలర్ రూ. 100కి చేరితే పసిడి ధర రూ. 2 లక్షలను దాటవచ్చు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం, జీఎస్టీ రేట్లు, ఆభరణాల కొనుగోలుపై వర్తించే తయారీ కూలి పన్నులు కలిపితే వినియోగదారుడిపై భారం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, సిస్టమాటిక్ పద్ధతిలో వాయిదాలలో బంగారం లేదా గోల్డ్ ETF లలో కేటాయింపులు చేసుకోవడం సురక్షితమైన వ్యూహమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

