బంగారం ధర త్వరలో 5 వేల డాలర్లకు.. అమెరికా అప్పుల భారం దెబ్బకు పసిడి పరుగులు..
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో పసిడి పరుగు కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపుపై సానుకూల అంచనాలు పెరగడం, పశ్చిమాసియాలో ముదిరిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిల వైపు శరవేగంగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ కామెక్స్ (COMEX) మార్కెట్లో ప్రారంభ ట్రేడింగ్‌లోనే Gold ధర 0.50 శాతం మేర లాభపడి ఔన్సుకు 4,703.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మే 2026 తర్వాత పసిడి ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి కావడంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.
అంతర్జాతీయ మార్కెట్లోని ఈ ఉత్సాహం దేశీయ మార్కెట్లో కూడా స్పష్టంగా కనిపించింది. భారతీయ ఎంసీఎక్స్ (MCX) ఫ్యూచర్స్ మార్కెట్లో అక్టోబర్ బంగారం కాంట్రాక్ట్ 0.75 శాతం పురోగమించి 10 గ్రాములకు ఏకంగా రూ. 1,63,650 వద్ద ముగిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో Gold ఔన్సుకు 4,640 డాలర్ల నుండి 4,650 డాలర్ల శ్రేణిలో ఊగిసలాడుతోంది. గడిచిన నెల రోజుల్లోనే బంగారం దాదాపు 14 శాతం మేర లాభపడటం విశేషం.

పసిడికి మళ్లీ ఈ స్థాయిలో ఆదరణ పెరగడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక స్థిరత్వంపై తలెత్తుతున్న ఆందోళనల నడుమ యూఎస్ డాలర్ ఇండెక్స్ పలు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ బలహీనపడటంతో ఇతర కరెన్సీ కలిగిన ఇన్వెస్టర్లకు బంగారం చవకగా మారి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి తోడు అమెరికా ప్రభుత్వ అప్పుల భారం 40 ట్రిలియన్ డాలర్లను అధిగమించడంతో రుణ వ్యయాలను తగ్గించేందుకు, మార్కెట్లో ద్రవ్యతను పెంచేందుకు దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల పునఃకొనుగోళ్లను (Buybacks) విస్తరించాలని యూఎస్ ట్రెజరీ నిర్ణయించింది. ఈ పరిణామం మార్కెట్లో అనిశ్చితిని పెంచడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ప్రత్యామ్నాయ ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యతనిచ్చారు.
మరోవైపు అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు 2026 మొదటి త్రైమాసికంలోనే సుమారు 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తమ నిల్వలను పెంచుకున్నాయి. పసిడి ఆధారిత ఈటీఎఫ్‌లలోకి సెప్టెంబర్ 2025 తర్వాత అత్యంత భారీగా నిధులు తరలివచ్చాయి. ఇవన్నీ చాలవన్నట్లు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన తీవ్ర ఉద్రిక్తతలు పసిడి ర్యాలీకి అదనపు బలాన్ని చేకూర్చాయి.
గతంలో అమెరికా-ఇరాన్ సంఘర్షణ తీవ్రస్థాయికి చేరినప్పుడు.. ఫిబ్రవరి 28, 2026న బంగారం ఔన్సుకు 5,399.60 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో.. బంగారం త్వరలోనే 5 వేల డాలర్ల సైకలాజికల్ మైలురాయిని తాకే అవకాశం ఉందని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 4,700 డాలర్ల నుండి 4,750 డాలర్ల శ్రేణి తక్షణ నిరోధక జోన్ (Resistance) గా మారగా.. దీనిని దాటితే ధర సులభంగా 4,850 డాలర్ల నుండి - 4,900 డాలర్ల వైపు వెళ్లి.. ఆపై 5,000 డాలర్ల మార్కును చేరుకోవచ్చు. అలాగే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో రూ. 1,65,000 నుండి రూ. 1,66,000 వరకు ప్రధాన రెసిస్టెన్స్‌గా ఉండనుంది. అయితే రాబోయే యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ ఇచ్చే సంకేతాలు బంగారం తదుపరి గమనాన్ని నిర్దేశించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
