బంగారం ధరలు తగ్గాయని సంబరం వద్దు.. వచ్చే నెలలో పసిడి ర్యాలీ ఈ రేటు దాకా తప్పదంటున్న యూబీఎస్..
Gold Price Forecast: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ప్రియులను.. పెట్టుబడిదారులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసిన బంగారం ధరలు రెండు రోజుల భారీ పతనం నుంచి ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వారం ప్రారంభంలో నమోదు అయిన తీవ్ర క్షీణతతో పోలిస్తే బులియన్ మార్కెట్ బుధవారం నాటికి కొంత ఉపశమనాన్ని పొందింది.
మంగళవారం లభించిన సానుకూల మద్దతుతో పాటు బుధవారం ఉదయం Gold ధరలు మరింత పుంజుకుని ఔన్సుకు 4,195 డాలర్ల మార్కు వద్ద ట్రేడయ్యాయి. అయితే సెప్టెంబర్ నెలలో మొత్తం మీద చూస్తే బంగారం తీవ్ర పతనాన్నే మూటగట్టుకుంది. సోమవారం ఒక్క రోజే మూడు శాతానికి పైగా ధర పడిపోయి 4,025 డాలర్ల వద్ద ముగియడం వల్ల ఈ నెలలో బులియన్ విలువ దాదాపు ఆరు శాతం వరకు తగ్గిపోవడం గమనార్హం.

ఈ పతనానికి ప్రధానంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ విపరీతంగా పెరగడం, డాలర్ సూచీ బలోపేతం కావడం కారణాలుగా నిలిచాయి. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంలో పెట్టుబడులు పెట్టడం కంటే బాండ్లు, డాలర్లలో డిపాజిట్ చేయడం లాభదాయకంగా భావించిన ఇన్వెస్టర్లు బంగారం అమ్మకాలకు ఎగబడటంతో బులియన్ పై ఒత్తిడి పెరిగింది.
అయితే బుధవారం అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, వచ్చే అక్టోబర్ నెలలో జరగబోయే సమీక్షలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలను ఇన్వెస్టర్లు తగ్గించుకోవడంతో పతనానికి అడ్డుకట్ట పడింది. కానీ సెప్టెంబర్‌లో నమోదైన ఈ క్లిష్టమైన పతనం వల్ల గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ యూబీఎస్ సెప్టెంబర్ 24న అంచనా వేసిన నాలుగు వేల ఆరు వందల డాలర్ల స్థాయిని ఈ సంవత్సరాంతానికి చేరుకోవడం తీవ్ర సవాలుగా మారింది.
సెప్టెంబర్ పతనానికి ముందే వెలువడిన యూబీఎస్ మునుపటి అంచనాల ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగారం 4,600 డాలర్లకు, రాబోయే ఏడాది అనగా వచ్చే జూన్ నాటికి 5,200 డాలర్లకు, అలాగే ఏడాది తిరిగేసరికి 5,400 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నేటి ధరలతో పోలిస్తే ఇది దాదాపు ఇరవై ఎనిమిది శాతానికి పైగా లాభాలను అందిస్తుందని సదరు బ్యాంక్ లెక్కగట్టింది.
ఫెడరల్ రిజర్వ్ తీసుకునే స్వల్పకాలిక వడ్డీ రేట్ల నిర్ణయాల కంటే, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు జరుపుతున్న నిలకడైన బంగారు కొనుగోళ్లు, దీర్ఘకాలిక పెట్టుబడి డిమాండ్‌కే యూబీఎస్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. బంగారాన్ని కేవలం తక్షణ లాభాల సాధనంగా కాకుండా, పోర్ట్‌ఫోలియో రక్షణకు, వైవిధ్యానికి కీలకమైన హెడ్జింగ్ సాధనంగా చూడాలని బ్యాంక్ వ్యూహకర్త గియోవన్నీ స్టౌనోవో విశ్లేషించారు.
మున్ముందు ఈ వడ్డీ రేట్ల అంచనాలు అలాగే కొనసాగుతాయా లేదా అనేది త్వరలో వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ నివేదికలు అనుకూలంగా లేక బాండ్ ఈల్డ్స్ మళ్లీ పెరిగితే బులియన్‌పై ఒత్తిడి పునరావృతమవుతుంది. ఆ ఒత్తిడిని అధిగమించి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఎంతవరకు సహకరిస్తాయో వేచి చూడాల్సిందే.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

