బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక.. డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
ప్రపంచ బులియన్ మార్కెట్లలో Gold ధరలు మళ్లీ చురుగ్గా పరిగెడుతున్నాయి. శనివారం నాడు అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం కంటే ఎక్కువగా పెరిగి, రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు బంగారం ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్‌గా భావించే బంగారం దిగుబడి ఇవ్వకపోయినా, వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితుల్లో భారీగా లాభపడే ఆస్తిగా భావించారు. అదే సమయంలో, వెండి ధరలు కూడా చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకొని మార్కెట్‌ను ఆశ్చర్యపరిచాయి.
ఈ వారం మొత్తంగా పసిడి 3.4 శాతం లాభం సాధించబోతుందని అంచనా. ఈ నెలలో ఇప్పటికే సుమారు 5 శాతం పెరుగుదల నమోదవ్వడంతో వరుసగా నాల్గో నెలకు కూడా బంగారం నెలవారీ లాభం పొందనున్నదని నిపుణులు చెబుతున్నారు. వెండి కూడా ఔన్సుకు 56.41 డాలర్లకు చేరుకొని సెషన్‌లో 5.3 శాతం.. నెలలో 15.2 శాతం పెరగడం ద్వారా రికార్డు స్థాయిని నమోదు చేసింది.US Gold Futures ఫిబ్రవరి డెలివరీ ధర 1 శాతం పెరిగి ఔన్సుకు 4,245.70 కు డాలర్లకు చేరుకుంది.

TD సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ బార్ట్ మెలెక్ మాట్లాడుతూ.. 2026 వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమన దశను ఎదుర్కొనవచ్చని, ఇటువంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఎంతో ఉన్నదని చెప్పారు. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం బంగారం ధరలకు అత్యంత అనుకూలమని ఆయన విశ్లేషించారు.
ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ వడ్డీ రేట్లపై ఇచ్చిన సాఫ్ట్ వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ షట్‌డౌన్ నేపథ్యంలో వచ్చిన బలహీన ఆర్థిక డేటా అన్నీ కలిసి వడ్డీ రేటు తగ్గింపు దిశగా అంచనాలను బలపరిచాయి. డిసెంబర్‌లో రేటు తగ్గించే అవకాశం ప్రస్తుతం వ్యాపారుల అంచనాలలో 87 శాతం దాకా పెరిగింది, ఇది గత వారం 50 శాతం మాత్రమే ఉండేది.
అయితే ఆసియా మార్కెట్లలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారతదేశంలో వివాహాల సీజన్ మొదలైనప్పటికీ, అధిక ధరలు వినియోగదారులను కొనుగోళ్ల నుండి వెనక్కి నెడుతున్నాయి. చైనాలో బంగారం కొనుగోలు పన్ను మినహాయింపు రద్దు కావడం ప్రజల ఆసక్తిని తగ్గించింది. అయినప్పటికీ, విశ్లేషకులు దీన్ని తాత్కాలిక ప్రతికూలతగా చూస్తున్నారు.ఇక ప్లాటినం ధరలు 3.2 శాతం పెరిగి 1,659.02 డాలర్లకు చేరుకున్నాయి.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
పల్లాడియం 1.3 శాతం పెరిగి 1,456.68 డాలర్లు నమోదు చేసింది. ఈ వారం ప్లాటినం 10 శాతం, పల్లాడియం 6 శాతం పెరిగాయి.ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. పెట్టుబడిదారులలో బంగారం మీద నమ్మకం పెరుగుతూ ఉంది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ధృవీకరణ వస్తే, డిసెంబర్ నెలలో కూడా ధరలు మరింతగా ఎగబాకే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications