బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. సామాన్యులకు మంచి రోజులు వచ్చాయంటున్న ఆర్థిక నిపుణులు..
అంతర్జాతీయ, దేశీయ బులియన్ విపణిలో మంగళవారం (సెప్టెంబర్ 29, 2026) పసిడి, వెండి ధరలు తీవ్రమైన ఒత్తిడికి గురై భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో (COMEX) బంగారం ధర 1.57 శాతం క్షీణించి ఔన్సుకు $4,253.40కి చేరగా.. వెండి ధర ఏకంగా 2.76 శాతం పడిపోయి ఔన్సుకు $63.01 వద్ద ట్రేడ్ అయింది.
ఆ ప్రభావంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మార్కెట్‌లోనూ విక్రయాల జోరు కొనసాగింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర కిలోగ్రాముకు రూ. 6,300 తగ్గగా.. బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,900 వరకు పతనమైంది. దీంతో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల Gold ధర రూ. 1,48,156 స్థాయికి, కిలోగ్రాము వెండి ధర రూ. 2,28,788 స్థాయికి పడిపోయాయి.

గత వారంలో మొదలైన ఈ నష్టాల పరంపర మంగళవారం కూడా కొనసాగింది. డిసెంబర్ డెలివరీ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర గత వారంలో ఔన్సుకు $103.70 (2.34 శాతం) తగ్గి $4,321.20 వద్ద ముగియగా, వెండి ఔన్సుకు $2.35 (3.5 శాతం) తగ్గి $64.80 వద్ద క్లోజ్ అయింది.
పసిడి, వెండి లోహాలపై ఈ స్థాయిలో విక్రయాల ఒత్తిడి పెరగడానికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై మారిన అంచనాలే ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్ నెల మానిటరీ పాలసీ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు గ్లోబల్ మార్కెట్లో తీవ్రం కావడంతో, వడ్డీ రాబడి లేని Gold, వెండి వంటి లోహాల నుంచి పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకుని బాండ్ల వైపు తరలిస్తున్నారు.
అదే సమయంలో అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టమైన 101.39 స్థాయికి చేరడం, యూఎస్ ట్రెజరీ బాండ్ రాబడులు (Yields) 2004 తర్వాత ఎన్నడూ లేని రికార్డు స్థాయికి ఎగబాకడం బులియన్ మార్కెట్‌పై అదనపు భారాన్ని మోపాయి.
ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపిన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం రూ. 1.50 లక్షల నుండి రూ. 1.54 లక్షల రేంజ్ పరిధిలో తీవ్ర అస్థిరతకు లోనై.. లాభాల స్వీకరణ కారణంగా పతనమైంది.
మరోవైపు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి ముప్పు కారణంగా ముడి చమురు ధరలు $107 దాటడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకుంటుందనే భయాలు బాండ్ దిగుబడులను మరింత గరిష్ట స్థాయిలోనే ఉంచుతున్నాయి. భౌగోళిక-రాజకీయ అస్థిరతలు పసిడికి సురక్షిత సాధనంగా (Safe Haven) మద్దతునిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి బలమైన డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ ఒత్తిడే బులియన్ పరుగును అడ్డుకుంటోందని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతొ సామాన్యులకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. వచ్చేది పండుగల సీజన్ కావడంతో పసిడి ధరలు తగ్గితే కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలో మధ్యతరగతి వారు ఉన్నారు. ముందు ముందు ఇంకా ధరలు పతనమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

