బంగారం ధరలు తగ్గాయని సంబర పడకండి.. ముందుంది ముసళ్ళ పండుగ అంటున్న కామర్జ్‌బ్యాంక్..
Gold Price Crash in October 2026: పసిడి ప్రేమికులు, ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ దిగ్గజ జర్మన్ బ్యాంక్ కామర్జ్‌బ్యాంక్ (Commerzbank) కీలకమైన ఆర్థిక నివేదికను విడుదల చేసింది. అక్టోబర్ నెలలో బంగారం ధరలలో నమోదైన తీవ్రమైన క్షీణత 'మితిమీరినది' (Overdone) అని.. ప్రస్తుతం ఈ పతనానికి తగిన బలమైన ప్రాథమిక కారణాలు ఏవీ లేవని స్పష్టం చేసింది.
దీర్ఘకాలికంగా పసిడికి మద్దతు ఇచ్చే ఆర్థిక కారకాలు ఇంకా సురక్షితంగానే ఉన్నందున.. ప్రైస్ కరెక్షన్‌లో వస్తున్న ఈ తగ్గుదలను ఇన్వెస్టర్లు ఒక ఆకర్షణీయమైన కొనుగోలు అవకాశంగా (Buying Opportunity) మలచుకోవచ్చని ప్రముఖ కమోడిటీ విశ్లేషకుడు కార్స్టెన్ ఫ్రిట్ష్ వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు అక్టోబర్ నెల తీవ్ర ప్రతికూలంగా మారింది. ఈ ఒక్క నెలలోనే పసిడి ధరలు దాదాపు 7 శాతం మేర పడిపోయాయి. గత వారం పసిడి తీవ్రమైన విక్రయాల ఒత్తిడికి గురై ఒక్కరోజే 4 శాతం పతనమై ఔన్సుకు 3,870 డాలర్ల కనిష్ట స్థాయికి చేరింది.

అయితే ఆ తర్వాత కొంత కోలుకుని ప్రస్తుతం 3,900 డాలర్ల పైన స్థిరపడింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఒక అక్టోబర్ నెలలో బంగారం ఇంత దారుణంగా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పసిడి పతనానికి సాధారణ సూత్రాలకు భిన్నమైన కారణాలు:
సాధారణంగా బంగారం ధరలను ప్రభావితం చేసే వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాల కంటే ఈసారి అనూహ్యమైన ఇతర పరిణామాలు బంగారంపై ఒత్తిడి తెచ్చాయని కామర్జ్‌బ్యాంక్ విశ్లేషించింది.
చమురు మంటలు - ఫెడ్ వడ్డీ భయాలు: WTI క్రూడ్ ఆయిల్ ధరలు 6 నెలల గరిష్ట స్థాయికి చేరడం ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తుందనే భయాలను రేకెత్తించింది. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే రక్షణ కవచమే అయినప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం అధికంగా ఉంచుతుందనే అంచనాలు బంగారంపై నెగెటివ్ ప్రభావం చూపాయి.
టెక్ స్టాక్స్ క్రాష్ & మార్జిన్ కాళ్ళు: గ్లోబల్ బిగ్ టెక్ కంపెనీల ఆదాయాలు నిరాశాజనకంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు కుప్పకూలాయి. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి, మార్జిన్ కాల్స్ (Margin Calls) చెల్లించడానికి బిగ్ ఇన్వెస్టర్లు, గోల్డ్ ఈటిఎఫ్ (Gold ETF) నిధులను, ఫ్యూచర్స్ పొజిషన్లను అత్యవసరంగా విక్రయించి నగదుగా మార్చుకున్నారు.
బాండ్ ఈల్డ్స్ వ్యతిరేక ధోరణి: యూఎస్ ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచడంతో అమెరికా బాండ్ రాబడులు (US Bond Yields) తగ్గినప్పటికీ, స్టాక్ మార్కెట్ లిక్విడిటీ ఒత్తిడి వల్ల బంగారం పుంజుకోలేకపోయింది. కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) డేటా ప్రకారం, అక్టోబర్‌లో బుల్లిష్ ట్రేడర్లు తమ పసిడి హోల్డింగ్స్‌ను 5 నెలల కనిష్టానికి తగ్గించుకున్నారు.
దీర్ఘకాలంలో బంగారం ఎందుకు పెరగనుంది?
స్వల్పకాలికంగా ధరలు పడిపోయినప్పటికీ.. దీర్ఘకాలికంగా బంగారం అద్భుతమైన రాబడులను ఇస్తుందని కామర్జ్‌బ్యాంక్ విశ్వసిస్తోంది. అమెరికా ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడం, పెరుగుతున్న అమెరికా ప్రభుత్వ అప్పులు (US Sovereign Debt) బంగారానికి తిరుగులేని మద్దతును ఇస్తాయని కార్స్టెన్ ఫ్రిట్ష్ స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా బడ్జెట్ లోటు వారి జీడీపీలో 6 శాతాన్ని మించడమే కాకుండా.. మొత్తం యూఎస్ అప్పు జీడీపీలో 100 శాతానికి చేరుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తదుపరి కాలంలో అమెరికాలో ఈ స్థాయి అప్పులు నమోదు కావడం ఇదే తొలిసారి.
అమెరికా డాలర్ భవిష్యత్తులో బలహీనపడటం, క్రమంగా జీడీపీ రుణ భారం పెరగడం, కేంద్ర బ్యాంకులు నిరంతరంగా పసిడి నిల్వలను కొనుగోలు చేయడం వంటి అంశాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలను సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాల వైపు నడిపిస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
