బంగారం ధరలు తగ్గబోతున్నాయి.. 10 గ్రాములు ఏకంగా లక్ష రూపాయల దిగువకు..కారణం ఏంటంటే..
గతేడాది సిరుల పంట పండించిన బంగారం ధర ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో బంగారం ధరలు చుక్కలను తాకాయి. అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి నేల చూపులు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనపడటం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డాలర్ విలువ పడినప్పుడల్లా పెట్టుబడిదారులు బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు.
జనవరి 2026లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల Gold ధర రూ. 1,80,779 అనే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఈ రికార్డు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత వారం శుక్రవారం నాటికి MCX బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,56,200 వద్ద ముగిసింది. అంటే తన గరిష్ట స్థాయి నుంచి దాదాపు రూ. 24,500 లేదా 13.5 శాతం మేర పతనం నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. COMEX Gold ధర ఔన్సుకు 5,046.30 డాలర్ల వద్ద ముగిసింది. ఇది గతంలో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి 5,626.80 డాలర్లతో పోలిస్తే దాదాపు 10.5 శాతం తక్కువ. ఈ పతనానికి ప్రధాన కారణం బంగారం ధరల ర్యాలీకి ఇంధనంగా పనిచేసిన అంశాలు ఒక్కొక్కటిగా బలహీనపడటమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిణామాలకు కేంద్రబిందువుగా మారింది రష్యా. వార్తా సంస్థ Bloomberg ఉదహరించిన ఒక అంతర్గత క్రెమ్లిన్ పత్రం ప్రకారం.. రష్యా అమెరికాతో మళ్లీ అమెరికా డాలర్లలో (USD) వాణిజ్య సెటిల్‌మెంట్లకు తిరిగి రావడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే రష్యాతో పాటు BRICS దేశాలు చేపట్టిన డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది.
BRICS దేశాలు గత కొన్నేళ్లుగా యుఎస్ డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకుని.. బంగారాన్ని నిల్వ చేసుకునే వ్యూహాన్ని అవలంబించాయి. ఈ విధానమే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే రష్యా మళ్లీ డాలర్ ఆధారిత వాణిజ్యానికి మొగ్గు చూపితే.. ఈ మొత్తం వ్యూహంలోనే నిర్మాణాత్మక మార్పు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
PACE 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ Amit Goel మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యంపై క్రెమ్లిన్ దృష్టి పెట్టిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇతర కరెన్సీ సెటిల్‌మెంట్లను అంగీకరించకపోవడంతో.. USDలోనే వాణిజ్యం చేయాల్సిన పరిస్థితి రష్యాకు ఎదురవుతుందని ఆయన విశ్లేషించారు. రష్యా ఇప్పటివరకు ఈ నివేదికలను ఖండించకపోవడం మార్కెట్‌లో అనుమానాలను మరింత పెంచుతోందని అన్నారు.
మరోవైపు సెబీ-రిజిస్టర్డ్ మార్కెట్ నిపుణుడు అనుజ్ గుప్తా మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్ల డిమాండ్-సరఫరా అసమతుల్యత ఏర్పడి ధరలు పెరిగాయని చెప్పారు. ముఖ్యంగా BRICS దేశాల కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారాన్ని కొనడం ఈ ర్యాలీకి బలమిచ్చిందన్నారు. అయితే ఈ కొనుగోళ్లకు విరామం వస్తే లేదా కేంద్ర బ్యాంకులు బంగారం అమ్మకాలకు దిగితే.. ధరల్లో పదునైన దిద్దుబాటు తప్పదని హెచ్చరించారు.
భవిష్యత్‌పై అంచనాల విషయానికి వస్తే.. అమిత్ గోయెల్ మాట్లాడుతూ ఈ పతనం ఒక్కసారిగా జరగదని, పలుమార్లు "డెడ్ క్యాట్ బౌన్స్"లతో కొనసాగుతుందని తెలిపారు. భారతదేశంలో బంగారం ధరలు ఇప్పటికే సుమారు 15 శాతం తగ్గాయని.. పరిస్థితులు ఇలానే కొనసాగితే 10 గ్రాములకు రూ. 1 లక్ష కంటే దిగువకు వెళ్లే అవకాశముందని అంచనా వేశారు. అంతర్జాతీయంగా COMEX బంగారం ధరలు 2027 చివరి నాటికి ఔన్సుకు 3 వేల డాలర్ల వరకు పడిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
క్లుప్తంగా చెప్పాలంటే రష్యా.. డాలర్‌కు తిరిగి వచ్చే అంశం గ్లోబల్ గోల్డ్ మార్కెట్‌లో పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు ఇకపై బంగారం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications