ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..
విశాఖపట్నం సముద్ర తీరంలో సాధారణంగా ఐస్‌క్రీమ్‌లు, బజ్జీలు అమ్మే తోపుడు బండ్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డుకు వెళ్లిన పర్యాటకులు ఒక వింతైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆర్కే బీచ్‌లోని సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగా ఐస్‌క్రీమ్ బండిని పోలిన ఒక తోపుడు బండిపై ఏకంగా బంగారు ఆభరణాలు, నాణేలను విక్రయించడం అందరినీ ఆకర్షించింది. ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ చేపట్టిన ఈ వినూత్న మార్కెటింగ్ ప్రయోగం ఇప్పుడు నగరంవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా బంగారం అంటే భారీ భద్రత కలిగిన షోరూమ్‌లలో, అద్దాల వెనుక కొనుగోలు చేస్తాం. కానీ, సామాన్యులకు సైతం బంగారాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో 'గోల్డ్ ఆన్ వీల్స్' అనే పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పూర్వ కాలంలో గ్రామాల వీధుల్లోనే Gold, ఇతర విలువైన వస్తువులను విక్రయించే వారనే పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఈ కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఈ తోపుడు బండి వద్దకు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు ఐస్‌క్రీమ్‌ను అందించినట్లుగానే బంగారు వస్తువులను అందిస్తున్నారు. ఈ బండిపై కేవలం 800 రూపాయలకే బంగారు నాణేన్ని విక్రయించడం విశేషం. అతి తక్కువ ధరకే బంగారం లభిస్తుండటం, పైగా ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకపోవడంతో సాయంత్రం సరదాగా బీచ్‌కు వచ్చిన సందర్శకులు పెద్ద ఎత్తున ఈ బండి వద్ద క్యూ కట్టారు.
తమకు కావాల్సిన నాణేలను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. రోడ్డుపై ఇలా Gold అమ్మడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, నిర్వాహకులు కేవలం తక్కువ విలువ కలిగిన వస్తువులను మాత్రమే ఈ బండిపై ఉంచారు. ఖరీదైన నగలు కావాలనుకునే వారు నేరుగా తమ షోరూమ్‌లను సందర్శించాలని వారు స్పష్టం చేశారు.
ఈ నెల 11, 12 తేదీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విక్రయాలకు అనూహ్య స్పందన లభించింది. దీంతో నిర్వాహకులు ఈ నెలాఖరులో అంటే 18, 19, 20 తేదీల్లో కూడా మళ్లీ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు కొనసాగిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
బంగారం అమ్మడం అంటే ఇదేం విడ్డూరం!" అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వినూత్న మార్కెటింగ్ టెక్నిక్‌ను మెచ్చుకుంటున్నారు. మొత్తానికి విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఈ 'గోల్డ్ ఆన్ వీల్స్' ప్రయోగం వ్యాపార రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్లయింది. వినియోగదారులను ఆకర్షించడంలో ఈ జ్యువెలరీ సంస్థ సఫలమైందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications