అమెరికా ఎఫెక్ట్: రెండ్రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ తర్వాత రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య కనిపించింది. ఇటీవల క్రమంగా పెరుగుతూ రూ.39వేల మార్క్ చేరుకుంది. తాజాగా, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం శుక్రవారం (జనవరి 3) భారీగా పెరిగింది. శనివారం కూడా అదే పరిస్థితి. జనవరి 3న ఆరేళ్ల గరిష్టానికి సమీపంలో నిలిచింది.

అందుకే ఒక్కరోజులో రూ.800 పెరిగింది
10 గ్రాముల 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం ఢిల్లీలో ఏకంగా రూ.752 పెరిగి రూ.40,652కు చేరుకుంది. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక కిలో వెండి రూ.960 పెరిగి రూ.48,870కి చేరుకుంది. గురువారం బంగారం 39,900 వద్ద ఉంది. కానీ ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే రూ.800 వరకు పెరిగింది.

శనివారమూ భారీగా పెరిగిన ధర
బంగారం ధర 15 రోజుల్లో రూ.2,000 పెరిగింది. వెండి ధర రూ.3,000 పెరిగింది. ఇక, హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర శనివారం రూ.610 పెరిగి రూ.37,930కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.660 పెరిగి రూ.41,400 వరకు చేరుకుంది. కిలో వెండి ధర హైదరాబాదులో రూ.49,400కు చేరుకుంది.

మరింత భారీగా పెరగనున్న బంగారం
ఇప్పటికే రూ.40,000 మార్క్ చేరుకున్న బంగారం రూ.50,000 దిశగా పరుగు పెడుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,550 డాలర్లకు చేరుకుంది. అమెరికా - ఇరాన్ ఉద్రిక్తతల పరిస్థితులనేపథ్యంలో ఈ ధర మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. బంగారం అంతకంతకూ పెరగవచ్చునని చెబుతున్నారు. 2020లో బంగారం రూ.45,000కు చేరుకోవచ్చునని ఇదివరకే అంచనా వేశారు.


Click it and Unblock the Notifications