బంగారు ఆభరణాలు కొనడం మానేయండి .. కీలకమైన హెచ్చరికను చేస్తోన్న కోటక్ బ్యాంక్
భారతీయులకు బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు. భావోద్వేగాల, సంప్రదాయాల, తరతరాలుగా కొనసాగుతున్న భద్రతా భావనకు ప్రతీక. పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు ఏ సందర్భమైనా, Gold కొనడం శుభం అని భావిస్తారు. ధనవంతులు తమ సంపదను ప్రదర్శించడానికి బంగారు ఆభరణాలను ధరిస్తారు. సాధారణ ప్రజలకు, బంగారం అత్యవసర పరిస్థితుల్లో చేతికందే సురక్షిత ఆస్తి. ఇలాంటిది మరే ఆస్తిలో కనిపించదు కాబట్టి..భారతీయుల మనసులో బంగారానికి ప్రత్యేకస్థానం ఉంది.
అయితే, ఈ సంప్రదాయ భావనల వెనుక ఒక ఆర్థిక వాస్తవం దాగి ఉంది. కోట్లాది మంది భారతీయులు బంగారాన్ని పెట్టుబడిగా కొనుగోలు చేస్తున్నామనుకుంటున్నప్పటికీ, వారు బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల రూపంలోనే కొనుగోలు చేస్తారు. కోటక్ ఈక్విటీస్ తాజా నివేదిక ప్రకారం.. బంగారాన్ని ఆభరణాలుగా కొనుగోలు చేయడం ఆర్థికపరంగా నష్టదాయకం. ప్రపంచంలో అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటైనా, భారతీయులు దాన్ని ఆభరణాలుగా కొనడం ద్వారా తమకే నష్టం చేసుకుంటున్నారని కోటక్ పేర్కొంది.

ఆభరణాలుగా బంగారం కొంటే తయారీ ఛార్జీలు, వేస్ట్‌జీలు,జీఎస్టీ,రిసేల్ సమయంలో నష్టాలు అనే అనేక రకాల అదనపు ఖర్చులు ఉంటాయి. సాధారణంగా ప్రాసెసింగ్ ఛార్జీలు 10 శాతం నుండి 20 శాతం వరకూ ఉంటాయి, కొన్నిసార్లు డిజైన్ ఆధారంగా ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. తిరిగి అమ్మే సమయంలో ఈ మొత్తం తిరిగి రాదు. అంతేకాక ఆభరణంలో ఉన్న రాళ్ల ధరను కూడా తిరిగి చెల్లించరు. అంటే, బంగారం కొనుగోలు చేసిన మొదటి రోజే విలువలో గణనీయమైన నష్టం సంభవిస్తుంది.
కోటక్ నివేదికలో బంగారంపై పెట్టుబడి చేయాలనుకునే వారు ఆభరణాల బదులుగా గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు లేదా గోల్డ్ నాణేలు / బార్‌లు కొనాలని సూచించింది. 2011 ఆర్థిక సంవత్సరం నుండి 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం వరకు, గోల్డ్ ETFలపై పెట్టుబడుల వార్షిక రాబడి సగటున 12.5 శాతం ఉండగా, అదే కాలంలో ఆభరణాల విలువ పెరుగుదల కేవలం 10 శాతం మాత్రమే ఉందని నివేదిక చెబుతోంది. అంటే, మీరు ఆభరణాలుగా బంగారం కొంటే మీ రాబడి తగ్గిపోతుంది.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతి చేసుకునే దేశం. ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల విలువైన Gold దేశంలోకి వస్తోంది. అయితే ఈ బంగారం ఎక్కువ భాగం ఇళ్లలో ఆభరణాల రూపంలో నిల్వగా ఉండిపోతుంది. ఇది దేశానికి వాణిజ్య లోటును పెంచుతుంది. ఎందుకంటే బంగారం ఆర్థికంగా ఉత్పాదక ప్రయోజనం కలిగించే విధంగా మార్కెట్లో తిరగదు.
కాబట్టి, బంగారాన్ని పెట్టుబడి కోణంలో చూస్తే ఆభరణాలు సరైన మార్గం కావని కోటక్ హెచ్చరిస్తోంది. భావోద్వేగ విలువ కోసం కొనడం ఒకటి, కానీ రాబడి ఆశిస్తూ కొనడం వేరేది. పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారు తప్పనిసరిగా ఆర్థిక ఉత్పత్తుల రూపంలోనే కొనాలని సూచించింది. క్లుప్తంగా చెప్పాలంటే బంగారాన్ని ప్రేమించండి, కానీ ఆభరణాలను కాదు. పెట్టుబడి కోసం ETFలు, నాణేలు, బార్‌లు ఎంచుకోండి. ఆర్థికంగా మీ భవిష్యత్తుకు అది మరింత ప్రయోజనకరమని కొటక్ చెబుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications