అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎంతంటే?
బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పసిడి వంటి అతి విలువైన వాటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,592.07 డాలర్లుగా ఉంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,594.20 వద్ద స్థిరంగా ఉంది.

1,600 డాలర్లకు సమీపంలో..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,600 డాలర్లకు చేరుకుంది. ఇక, ఇండియాలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో బంగారం ధర సోమవారం పెరిగింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.736 (1.78 శాతం) పెరిగి రూ.42,133గా ఉంది. వెండి ఫ్యూచర్స్ రూ.950 (2 శాతం) పెరిగి రూ.45,350కి చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,000 వరకు తగ్గింది.

ఈ కారణాలతో పెరిగిన బంగారం ధరలు
దేశీయ మల్టీ కమొడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే సోమవారం భారీగానే పెరిగింది. అంతర్జాతీయంగా అతివిలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ధరలు సోమవారం పెరిగాయి.

ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లో...
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.391 పెరిగి రూ.42,616 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,980కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.43,670 నుండి రూ.43,780కి చేరుకుంది.

వెండిదీ అదే దారి
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు కారణంగా కిలో వెండి రూ.713 పెరిగి రూ.46,213 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వంటి అతి విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది.


Click it and Unblock the Notifications