బంగారంపై ప్రధాని మోదీ మాటల వెనుక దిమ్మతిరిగే వ్యూహాం.. మన దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులే కదిలేలా..
భారతీయుల బంగారు మోజు కేవలం ఆభరణాలకు పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మనం ఈ వార్త చదువుతున్న నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల బంగారం అమ్ముడైపోతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం, భారతీయులు రోజుకు సగటున 2.2 టన్నుల బంగారాన్ని కొంటున్నారు, దీని విలువ దాదాపు రూ.2,200 కోట్లు. అంటే, ఒక రోజులో బంగారంపై చేసే ఖర్చుతో అనేక చిన్న నగరాల వార్షిక బడ్జెట్‌ను భర్తీ చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి వెనుక ఉన్న గంభీరమైన ఆర్థిక కారణాలను ఓ సారి చూద్దాం.
భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. కానీ, విచారకరమైన విషయం ఏమిటంటే, మనకు అవసరమైన బంగారంలో అత్యధిక భాగం విదేశాల నుండే దిగుమతి అవుతోంది. స్విట్జర్లాండ్, యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి మనం టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నాం. దీనికి బదులుగా మనం చెల్లించేది 'డాలర్లు'. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. 2018లో, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 63-65గా ఉండేది. అయితే, 2026 నాటికి అది 92-95కు చేరుకుంది.

భారతదేశం తన బంగారు అవసరాలలో దాదాపు ఎక్కువ భాగం విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది. స్విట్జర్లాండ్ నుండి అత్యధిక పసిడి వస్తుంది. యూఏఈ, దక్షిణాఫ్రికా, పెరూ, హాంగ్‌కాంగ్ కూడా భారతదేశానికి ప్రధాన సరఫరాదారులుగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే భారతదేశం ఎంత ఎక్కువ Gold కొనుగోలు చేస్తే, అంత ఎక్కువ డాలర్లు విదేశాలకు వెళ్తాయి.
గతంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లు ఉన్నప్పుడు మనకు విదేశీ మారక ద్రవ్యంపై భారం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం వల్ల అది 100 డాలర్లకు చేరింది. ఇంధనం కోసం మనం ఇప్పటికే భారీగా డాలర్లను ఖర్చు చేస్తున్నాం. దీనికి తోడు మనం బంగారం కోసం కూడా బిలియన్ల కొద్దీ డాలర్లను విదేశాలకు పంపితే, మన ఖజానా ఖాళీ అవుతుంది. ఫలితంగా రూపాయి విలువ పడిపోయి, మొబైల్ ఫోన్ల నుండి నిత్యావసరాల వరకు అన్నీ ఖరీదైనవిగా మారుతున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 11 నెలల్లోనే భారత్ సుమారు 69 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఈ భారీ మొత్తం దేశం దాటి వెళ్లిపోవడం వల్ల వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక నిల్వలు 40 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. దేశీయంగా ఉండాల్సిన సంపద విదేశీ గడ్డపైకి చేరుతుండటం ఆర్బీఐ (RBI) ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. 2018లో భారతదేశ బంగారు నిల్వలు సుమారు 560 టన్నులు ఉండగా, 2026 నాటికి అవి సుమారు 880 టన్నులకు చేరుకుంటాయని అంచనా.
భారతదేశంలో ఏటా కోటి పెళ్లిళ్లు జరుగుతాయి. వీటి బడ్జెట్‌లో 30% Gold పైనే ఖర్చు చేస్తారు. అక్షయ తృతీయ, దీపావళి వంటి పండుగలు బంగారానికి డిమాండ్‌ను అమాంతం పెంచుతున్నాయి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే బంగారాన్నే సురక్షితమైన ఆస్తిగా భావించే సామాన్యుల సెంటిమెంట్ దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది. బంగారం కేవలం పెట్టుబడిగా మిగిలిపోవడం వల్ల అది ఆర్థిక వ్యవస్థలో చలామణిలోకి రాకుండా బీరువాల్లో లాక్ అయిపోతోంది.
"బంగారు కొనుగోళ్లు వాయిదా వేయండి" అని ప్రధాని కోరడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే డాలర్లను ఆదా చేయడం. మనం బంగారం కొనడం తగ్గించిన క్షణమే రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది. దిగుమతి బిల్లు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది, ఈఎంఐలు (EMI) భారం తగ్గుతాయి. ప్రజలు తమ పెట్టుబడులను గోల్డ్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వైపు మళ్ళించడం ద్వారా ఆ సంపద దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
భారతీయులకు బంగారం ఒక లోహం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం, నమ్మకం. కానీ, ఆ నమ్మకం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకూడదనేది నేటి సంకల్పం. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో, ఒక సంవత్సరం పాటు పసిడి మోజును తగ్గించుకోవడం ద్వారా మనం రూపాయిని రక్షించుకోవచ్చు. దేశ ఆర్థిక గమనాన్ని మార్చడానికి ప్రతి పౌరుడు తన వంతుగా చేసే 'ఆర్థిక దేశభక్తి' ఇదేనని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications
