బంగారం, వెండిపై కొత్త రూల్స్.. నేటి నుంచే అమల్లోకి.. 15 శాతం పన్నుపోటుతో బిగ్ షాక్..
బంగారం ప్రేమికులు, జ్యువెలరీ ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశంలో పెరుగుతున్న దిగుమతులను నియంత్రించడం, విదేశీ మారక నిల్వలను సంరక్షించడం లక్ష్యంగా కేంద్రం కొత్త కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్స్ మే 13 నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇప్పటివరకు ఆభరణాల ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చిన అడ్వాన్స్ ఆథరైజేషన్ (AA) స్కీమ్‌పైనా కేంద్రం తొలిసారి పరిమితులు విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం కింద Gold దిగుమతులను గరిష్టంగా 100 కిలోగ్రాములకు పరిమితం చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, తొలిసారిగా దిగుమతి అనుమతి కోరే దరఖాస్తుదారుల పట్ల అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. అటువంటి దరఖాస్తుదారుల తయారీ కేంద్రం యొక్క ఉనికి, దాని సామర్థ్యం. పనితీరును నిర్ధారించడానికి సంబంధిత ప్రాంతీయ అధికార సంస్థలు తప్పనిసరిగా భౌతిక తనిఖీ నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం భవిష్యత్ దిగుమతి అనుమతులను ఎగుమతి పనితీరుతో ముడిపెట్టింది. గతంలో జారీ చేసిన ముందస్తు అనుమతుల కింద నిర్దేశించిన ఎగుమతి బాధ్యతలో కనీసం 50 శాతం నెరవేర్చిన తర్వాత మాత్రమే తదుపరి దిగుమతికి అనుమతి లభిస్తుంది. పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు, అడ్వాన్స్ ఆథరైజేషన్ పొందిన వారు తమ దిగుమతి, ఎగుమతి వివరాలను తెలియజేస్తూ స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ చేత ధృవీకరించబడిన 15 రోజుల పనితీరు నివేదికలను సమర్పించడం తప్పనిసరి చేయబడింది. అలాగే ప్రాంతీయ అధికారులు కూడా ఈ లావాదేవీలకు సంబంధించిన ఏకీకృత నివేదికలను ప్రతి నెలా DGFT ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో అనవసర దిగుమతులను తగ్గించి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుండి 15 శాతానికి పెంచడంతో పాటు, 3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) కూడా విధించడం వల్ల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు బంగారు దిగుమతుల విలువ 71.98 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, పరిమాణం పరంగా చూస్తే దిగుమతులు 721.03 టన్నులకు పడిపోయాయి.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్న వేళ, భారత్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరగడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్, సిల్వర్ దిగుమతులు ఏకంగా 26.7 శాతం పెరిగి 102.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్టమైన 95.75 వద్దకు చేరింది.
విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గించడం, రూపాయి విలువను కాపాడడం కోసం కేంద్రం ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, అవసరం లేని దిగుమతులను తగ్గించాలని ప్రధాని Narendra Modi ఇటీవల చేసిన పిలుపు తర్వాతే ప్రభుత్వం ఈ చర్యలను వేగంగా అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ అవసరాల కోసం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే బులియన్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు ఈ కొత్త నియంత్రణలు దోహదపడనున్నాయి.


Click it and Unblock the Notifications
