తులం బంగారం అంటే ఎంత.. 10 గ్రాములా.. 11.66 గ్రాములా.. పూర్తి క్లారిటీ ఇదే..
భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది సంప్రదాయం, సంస్కృతి, పెట్టుబడి, నమ్మకానికి ప్రతీక. వివాహాలు, పండుగలు లేదా భవిష్యత్తు కోసం చేసే పొదుపు ఏదైనా సరే, ప్రతి ఇంట్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా నగల దుకాణానికి వెళ్లినప్పుడు చాలామంది ఈ రోజు ఒక తులం బంగారం ధర ఎంత అని అడుగుతుంటారు. చాలామంది దృష్టిలో ఒక తులం అంటే 10 గ్రాములు. కానీ సాంప్రదాయ కొలమానాల ప్రకారం ఇది నిజం కాదు! నిజానికి ఒక తులం బరువు 10 గ్రాములు కాదు, అంతకంటే ఎక్కువ.
సాంప్రదాయ భారతీయ కొలమాన పద్ధతి ప్రకారం 1 తులం (తోలా) = 11.6638 గ్రాములు. 'తోలా' అనే పదం 'తుల' అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. తుల అంటే త్రాసు లేదా తూకం వేయడం అని అర్థం. ప్రాచీన కాలంలోనే కాకుండా మొఘలుల కాలంలో కూడా Gold, వెండి, ఔషధాలు, విలువైన సుగంధ ద్రవ్యాలను తోలాల్లోనే తూచేవారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు దీనిని అధికారిక ప్రామాణిక యూనిట్‌గా స్వీకరించి 180 గ్రెయిన్‌లుగా (సుమారు 11.66 గ్రాములు) స్థిరీకరించారు. కాబట్టి గణితపరంగా చారిత్రకంగా ఒక తులం అంటే 11.66 గ్రాములే.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంతర్జాతీయ మెట్రిక్ విధానాన్ని (కిలోగ్రాములు, గ్రాములు, లీటర్లు) అమల్లోకి తెచ్చింది. క్రమంగా నగల విపణిలో కూడా Gold ధరలను గ్రాములలో చెప్పడం ప్రారంభించారు. ఆభరణాల వ్యాపారంలో లెక్కలు సులభంగా ఉండటానికి, వినియోగదారుల సౌలభ్యం కోసం మార్కెట్ వర్గాలు 1 తులం = 10 గ్రాములుగా పరిగణించడం ప్రారంభించాయి.
1.66 గ్రాముల వ్యత్యాసం - కొనుగోలుదారులపై పడే భారం ఎంత? వాస్తవ లెక్క ప్రకారం 1 తులం అంటే 11.66 గ్రాములు. ఒకవేళ ఏ దుకాణదారుడైనా మీకు 1 తులం పేరుతో 10 గ్రాముల బంగారం విక్రయిస్తే, మీరు సుమారుగా 1.66 గ్రాముల పసిడిని తక్కువగా పొందుతున్నారని అర్థం.
సాధారణంగా చిన్న కొనుగోలులో ఇది పెద్ద వ్యత్యాసంగా అనిపించకపోయినా.. వివాహాలు లేదా భారీ పెట్టుబడుల సమయాల్లో ఈ 1.66 గ్రాముల వ్యత్యాసం వేల రూపాయల భారాన్ని కలిగిస్తుంది. అయితే, ప్రస్తుతం పారదర్శకత కోసం మెజారిటీ నగల వ్యాపారులు అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ బంగారాన్ని నేరుగా 'గ్రాముల' ప్రాతిపదికన మాత్రమే విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు కూడా తులం అనే పాత పద్ధతి కంటే గ్రాముల ప్రాతిపదికన బిల్లులను తనిఖీ చేసుకోవడం శ్రేయస్కరం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
