ఇటీవలి కాలంలో బంగారం ధరలు దూసుకుపోతున్న నేపథ్యంలో.. ధనత్రయోదశి 2025 (Dhanteras 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి సలహాదారు అంకుర్ ఝవేరి (Ankur Jhaveri) తాజాగా చేసిన విశ్లేషణ ప్రకారం.. గత కొద్ది నెలలుగా బంగారం ధరల్లో నమోదైన పెరుగుదలలో దాదాపు 20 శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందని స్పష్టం చేశారు.
అంకుర్ ఝవేరి తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలోని బంగారం విలువకన్నా ఎక్కువగా రూపాయి విలువపై ఆధారపడి ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటి. అంటే, భారతదేశం బంగారం కొనుగోలు చేసే సమయంలో డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే.. రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

ఉదాహరణకు, ఆయన చెప్పిన సులభమైన లెక్క
2020లో 500 డాలర్ల విలువైన బంగారం కొనుగోలు చేసినప్పుడు, డాలర్ మారకం రేటు రూ. 73 ఉంటే, ఆ బంగారం ధర రూ. 36,500 అవుతుంది. అదే బంగారం నేడు డాలర్ రూ. 88 వద్ద ఉంటే విలువ రూ.44 వేలు అవుతుంది. అంటే 20 శాతం లాభం వచ్చింది. అయితే అది బంగారం ధర పెరగడం వల్ల కాదు, రూపాయి విలువ పడిపోవడం వల్లనేనని చెప్పుకొచ్చారు.
ఈ ట్రెండ్ ఎప్పటికీ ఇలాగే కొనసాగదని ఝవేరి హెచ్చరించారు. 2025 చివరి నాటికి రూపాయి బలపడే అవకాశం ఉందని చాలా ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డాలర్ విలువ రూ. 88 వద్ద ఉన్నా, అది రూ. 84 వరకు బలపడవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది జరిగితే అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో బంగారం ధరలు సుమారు 4.5 శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. Gold ధరలు గ్లోబల్ మార్కెట్లో తగ్గిపోతే, ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది. అంటే, ధనత్రయోదశి సమయంలో భారీగా కొనుగోలు చేసే వారు రూపాయి బలపడినప్పుడు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.
ఝవేరి తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ మార్కెట్లో Gold పనితీరు రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుంది:
1. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర (USDలో)
2. భారత రూపాయి విలువ (USD-INR రేటు)
ప్రస్తుతం ఈ రెండు అంశాలు పెట్టుబడిదారులకు ప్రతికూలంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఇప్పటికే చారిత్రక గరిష్ట స్థాయిలో ఉంది, రూపాయి మరింత బలపడే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం పెట్టుబడి తాత్కాలికంగా లాభదాయకం కాకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనుగోలు భారతీయుల సాంప్రదాయమైన ఆచారం అయినప్పటికీ, ఈసారి కొనుగోలు చేసే ముందు మార్కెట్ పరిస్థితులను, రూపాయి విలువ దిశను పరిశీలించడం అవసరం. బంగారం ధరల పెరుగుదల ఎల్లప్పుడూ బంగారంతోనే సంబంధం లేదని రూపాయి మారకం విలువ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ విశ్లేషణ మరోసారి స్పష్టంగా చెబుతోంది. బంగారం మెరిసినా, దాని వెనుక దాగి ఉన్న కరెన్సీ ప్రభావాన్ని మర్చిపోవద్దని ధనత్రయోదశి సందర్భంగా పెట్టుబడిదారులకు హెచ్చరిక జారీ చేస్తున్నారు నిపుణులు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications