భారీగా తగ్గిన బంగారం డిమాండ్: ధరలు పెరిగినట్లుగా ఆదాయాలు పెరగడం లేదు.. అందుకే
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో దేశీయంగా బంగారానికి డిమాండ్ 70 శాతం క్షీణించి 63.7 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) తెలిపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 213.2 టన్నుల పసిడికి డిమాండ్ ఉంది. వ్యాల్యూరీత్యా రూ.62,420 కోట్ల నుండి 57 శాతం తగ్గి రూ.26,600 కోట్లకు పరిమితమైందని WGC ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. కరోనా సంక్షోభం వల్ల దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు తోడు, ధరలు పెరగడం కూడా ఈసారి డిమాండ్ తగ్గడానికి కారణంగా మారింది.

ఏడాదిన్నరలో 60%, 6 నెలల్లో 20% పెరుగుదల
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక పునరుత్తేజానికి అనుగుణంగా బంగారానికి డిమాండ్ రావొచ్చునని, దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగల సమయానికి కరోనా పరిస్థితులు తగ్గితే, కొనుగోళ్లు పెరగవచ్చునని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2019 జనవరి నుండి బంగారం ధరలు అరవై శాతం పెరిగాయని, ఈ ఏడాది జనవరి నుండి 20 శాతానికి పైగా పెరిగాయని వెల్లడించింది. బంగారం ధరలు పెరిగినట్లుగా ఆదాయాలు పెరగలేదన్నారు. అందువల్ల పూర్తి ఏడాదికి పరిస్థితిని అంచనా వేయలేమన్నారు.

బంగారు ఆభరణాల డిమాండ్
బంగారం ఆభరణాల డిమాండ్ 74% పడిపోయి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు క్షీణించింది. వ్యాల్యూపరంగా డిమాండ్ రూ.49,380 కోట్ల నుంచి రూ.18,350 కోట్లకు దిగజారింది. పెట్టుబడిగా బంగారం డిమాండ్ కూడా 56% తగ్గి 44.5 టన్నుల నుండి 19.8 టన్నులకు తగ్గింది. వ్యాల్యూపరంగా క్షీణత రూ.13,040 కోట్ల నుండి రూ.8,250 కోట్లుగా ఉంది. దేశంలో రీసైకిల్ చేసిన పసిడి 64% పడిపోయి 37.9 టన్నుల నుండి 13.8 టన్నులకు తగ్గింది. జూన్ 30తో ముగిసిన ఆరు నెలల కాలంలో డిమాండ్ 56% తగ్గింది.

డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం పెరుగుతున్నాయి
డిమాండ్ తగ్గినప్పటికీ ధరలు మాత్రం భారీగా పెరుగుతూ ప్రస్తుతం 10గ్రాములు రూ.53,000కు పైగా ఉండటం ప్రజల్లో నిరాసక్తతకు కారణమని చెబుతున్నారు. పసిడి ధర అంతర్జాతీయంగా జీవితకాల గరిష్టస్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ నైమెక్స్‌లో ధర తొమ్మిదేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications