బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..
దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా వెలుగొందుతున్న బంగారం.. ప్రస్తుతం అనూహ్యమైన పతనాన్ని చవిచూస్తోంది. గత వంద ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పది రోజుల పాటు ధరలు క్షీణించడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుండి బంగారం ధర ఏకంగా 27 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం ఇది 4,090 డాలర్ల వద్ద నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. పసిడి కాంతి ఎందుకు మసకబారుతుందనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఈ చారిత్రాత్మక పతనానికి ప్రధానంగా ఐదు కీలక మలుపులే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిది కారణంగా లాభాల స్వీకరణ వెల్లువను చూస్తున్నారు. బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు.. అప్రమత్తమైన పెద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను నగదు రూపంలోకి మార్చుకోవడం ప్రారంభించారు. ఈ పరిణామం విక్రయాల ఒత్తిడిని పెంచి, ధరలు వేగంగా తగ్గడానికి దారితీసింది.

రెండవ కారణం ఏంటంటే.. సాంకేతిక సంకేతాలను చూస్తున్నారు. ధరలు తగ్గుతూ వస్తున్న క్రమంలో బంగారం 4,090 డాలర్ల వద్ద ఉన్న 200-రోజుల మూవింగ్ యావరేజ్‌ను తాకింది. ఈ కీలక స్థాయి వద్ద ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోవడంతో పతనం మరింత తీవ్రమైందిగా భావించారు.
మూడవ మలుపు ఏంటంటే..ఇది పెట్టుబడిదారుల అంచనాలను తలకిందులు చేసింది. సాధారణంగా మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఫిబ్రవరి చివరలో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, Gold ధర పెరగకపోగా సుమారు 12 శాతం పడిపోయింది. ఇది బంగారంపై ఉన్న సాంప్రదాయ నమ్మకాన్ని కొంతవరకు దెబ్బతీసింది.
నాల్గవ మలుపును చూసినట్లయితే.. డిజిటల్ బంగారంగా పిలవబడే బిట్‌కాయిన్ బలమైన పోటీదారుగా అవతరించింది. Gold పడిపోతున్న తరుణంలో బిట్‌కాయిన్ 70 వేల డాలర్ల పైన స్థిరంగా నిలబడటంతో.. యువ పెట్టుబడిదారుల దృష్టి క్రిప్టో కరెన్సీ వైపు మళ్లింది.
అయిదవ మరియు అత్యంత ప్రభావవంతమైన మార్పును చూసినట్లయితే 'డబ్బు ప్రవాహం'లో కనిపించింది. గోల్డ్ ఈటీఎఫ్ (ETF)ల నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు బయటకు వెళ్లిపోతుండగా.. బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలోకి ఈ నెలలో సుమారు 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది పెట్టుబడిదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయనడానికి స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు.
అయితే, ప్రతి కథలోనూ ఒక మలుపు ఉన్నట్లుగానే.. గత 24 గంటల్లో బంగారం ధర సుమారు 2 శాతం కోలుకుంది. ఇది పతనం ఆగిపోవడానికి సంకేతమా లేక తాత్కాలిక విరామమా అనేది వేచి చూడాలి. క్లుప్తంగా చెప్పాలంటే బంగారం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందా లేదా బిట్‌కాయిన్ వంటి కొత్త తరం ఆస్తులు దాని స్థానాన్ని ఆక్రమిస్తాయా అనేది ప్రస్తుతానికి ఒక మిస్టరీగానే ఉంది. మార్కెట్ విశ్లేషకులు దీనిని ఒక పరివర్తన దశగా అభివర్ణిస్తున్నారు. పసిడి ప్రేమికులకు ఇది కొనుగోలు చేసే అవకాశమా లేక మరింత పతనానికి ఆరంభమా అనే క్లైమాక్స్ ఇంకా వెలువడాల్సి ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications