బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పసిడి బరువు పెంచేందుకు కల్తీ రేనియం పౌడర్.. టెస్టులకు సైతం చిక్కకుండా..
Gold Buyers Alert! బంగారం స్వచ్ఛతకు తిరుగులేని గ్యారెంటీగా భావించే హాల్‌మార్కింగ్ వ్యవస్థకే సవాల్ విసిరేలా ఒక భారీ కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీలు, సాంప్రదాయ పరీక్షలకే కాదు.. కొన్ని ఆధునిక హాల్‌మార్కింగ్ యంత్రాలకు కూడా దొరకకుండా బంగారంలో బరువైన లోహపు పొడిని కలుపుతున్న కొత్త తరహా మోసం మార్కెట్లో కలకలం రేపుతోంది. దైనిక్ భాస్కర్, మింట్ నివేదికల ప్రకారం.. ఈ కల్తీ దందా వెనుక చైనాకు చెందిన ఒక వ్యాపారవేత్త నెట్‌వర్క్ ఉన్నట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి.
బంగారం బరువును పెంచేందుకు అందులో రేనియం (Rhenium) అనే అత్యంత బరువైన లోహపు పొడిని కల్తీగా ఉపయోగిస్తున్నారు. చైనాలోని షెన్‌జెన్ నగరానికి చెందిన ఒక ఏజెంట్ తమ కంపెనీ రేనియం పౌడర్‌ను తయారు చేస్తుందని.. భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో తమకు డీలర్లు ఉన్నారని దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. బంగారంలో 25 శాతం వరకు రేనియం కలిపినా సరే సాధారణ పరీక్షల్లో గుర్తించడం కష్టమని సదరు ఏజెంట్ పేర్కొనడం గమనార్హం.

ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ముంబైలోని ఒక డీలర్ నుండి ఒక గ్రాము రేనియం పొడిని సేకరించి, జోధ్‌పూర్‌లోని ఒక నగల వ్యాపారి సహాయంతో ప్రయోగం నిర్వహించారు. 7.83 గ్రాముల 24-క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో ఒక గ్రాము రేనియం పొడిని కలిపి 8.83 గ్రాముల మిశ్రమాన్ని తయారు చేశారు. ఆశ్చర్యకరంగా సాధారణ పరీక్షా యంత్రం ఈ మిశ్రమాన్ని 24-క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగానే నిర్ధారించింది. ఆ తర్వాత ఆ మిశ్రమంతో 22-క్యారెట్ల ఆభరణాన్ని తయారు చేసి హాల్‌మార్కింగ్ కేంద్రానికి పంపగా.. అక్కడ కూడా దానికి 22-క్యారెట్ల సర్టిఫికేట్ జారీ అయింది. కానీ వాస్తవానికి ఆ ఆభరణంలో ఉన్న బంగారం కేవలం 81.73 శాతం మాత్రమే. అంటే దాని అసలు స్వచ్ఛత 22 క్యారెట్లకు బదులుగా సుమారు 20 క్యారెట్లు మాత్రమే ఉందని తేలింది.
కేవలం రేనియం మాత్రమే కాకుండా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బులియన్ మార్కెట్ వ్యాపారులు బంగారంలో రుథేనియం (Ruthenium), ఇరిడియం (Iridium), ఓస్మియం (Osmium) వంటి బరువైన లోహాలను కలుపుతున్నారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోహాల సాంద్రత బంగారంతో సమానంగా ఉండటం వల్ల ఆభరణాల బరువు పెరుగుతుంది. పైగా సాంప్రదాయ యాసిడ్, టచ్‌స్టోన్ పరీక్షల్లో ఇవి ఏమాత్రం దొరకవు.
మరోవైపు, దేశంలోని బంగారం నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ముసాయిదా నివేదిక ఎత్తిచూపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన నగల వ్యాపారులలో ఏకంగా 81 శాతం మందిని ఆడిట్ చేయలేదని కాగ్ పేర్కొంది. అంతేకాకుండా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తన గుర్తింపు పొందిన పరీక్షా, హాల్‌మార్కింగ్ కేంద్రాలను తనిఖీ చేయడంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 43.7 శాతం మేర చేరుకోలేకపోయింది. సిబ్బంది కొరత, మారుమూల ప్రాంతాల నుండి నమూనాల సేకరణలో ఇబ్బందులే ఇందుకు కారణమని బీఐఎస్ వివరణ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ (XRF), ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అధునాతన పరీక్షలతోనే ఇలాంటి కల్తీ లోహాలను గుర్తించగలమని వారు చెబుతున్నారు. కొనుగోలుదారులు ఎల్లప్పుడూ విశ్వసనీయమైన, పేరున్న నగల వ్యాపారుల వద్దే బంగారం కొనుగోలు చేయాలి. ఆభరణాలపై BIS హాల్‌మార్క్‌తో పాటు 6-అంకెల HUID నంబర్‌ను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ప్రతి కొనుగోలుకు పక్కా జీఎస్టీ ఇన్వాయిస్ బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. ఖరీదైన ఆభరణాల స్వచ్ఛతపై ఏమాత్రం సందేహం కలిగినా.. అధునాతన XRF పరీక్షా సౌకర్యాలు ఉన్న అధికారిక కేంద్రాలలో తిరిగి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications
