Gold Price Today: ఇండియన్స్ లవ్ గోల్డ్ అనే సామెత ఎప్పటికీ పాతది కాదేమో అనిపిస్తుంటుంది. వాస్తవానికి సందర్భం ఏదైనా ఎలాంటిదైనా భారతీయుల సెలబ్రేషన్స్ లో బంగారానికి ఒక ప్రధాన పాత్ర ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఇటీవల గడచిన రెండు వారాలుగా గోల్డ్ రేట్లు వింటుంటేనే సామాన్యులు వణికి పోతున్నారు.
దాదాపు రెండు వారాల్లో 10 గ్రాముల పసిడి ధరలు రూ.2,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం బంగారం 10 గ్రాములకు 24 క్యారెట్ల రేటు 70,000 మార్క్ దిశగా పరిగెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్ తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,795 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. మార్చిలో బంగారం కొత్త శిఖరాలను తాకడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. నేడు దిల్లీ, ముంబై, లక్నో, జైపూర్, కోల్‌కతా సహా అన్ని నగరాల్లో బంగారం సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠమైన రూ.66 వేల మార్కుకు సమీపించింది.

ఇదే క్రమంలో వెండి ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. కేజీ ధర దాదాపుగా రూ.80 వేల మార్కును అధిగమించటం కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తోంది. బంగారం ధర పెరుగుదల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని కేడియా కమోడిటీస్ ప్రెసిడెంట్ అజయ్ కేడియా పేర్కొన్నారు. ఆయన అంచనాల ప్రకారం.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యం గోల్డ్ రేట్ల పెరుగుదలకు అతిపెద్ద కారణంగా ఉంది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్, షాపింగ్ సమయంలోనూ ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవటం డిమాండ్ పెరుగుదలకు తద్వారా రేట్ల పెంపుకు కారణంగా నిలిచినట్లు కేడియా అభిప్రాయపడ్డారు.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(IBJA) ప్రకారం.. ఈ రోజు బంగారం కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నెలలో బంగారం కొత్త శిఖరాన్ని తాకడం ఇది నాలుగోసారి. దీనికి ముందు మార్చి 11న కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అలాగే మార్చి 5, 2024న ఆల్‌టైమ్ హై రూ.64,598కి చేరుకుంది. రెండు రోజుల తర్వాత మార్చి 7న చరిత్ర సృష్టించి రూ.65,049ని తాకింది. ప్రస్తుతం పసిడి రేట్లలో దూకుడు చూస్తుంటే మరికొద్ది రోజుల్లో 70,000 మార్కును చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. అయితే అందరి చూపులు ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటనవైపు ఉన్నందున రేట్లు తగ్గే అవకాశాలు సైతం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications