బంగారం, వెండి ధరల పెరుగుదల తాత్కాలికమే.. భారీ పతనం ముందు ముందు తప్పదంటున్న ప్రముఖ స్విస్ బ్యాంకులు..
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు పైకి ఎగసాయి. ఈ వారంలొ బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు సుదీర్ఘకాలం పాటు పతనం తర్వాత ఇటీవలి రోజుల్లో కోలుకున్నాయి. ఇటీవల స్పాట్ సిల్వర్ ఔన్సుకు 59.47 డాలర్ల వద్ద ట్రేడవుతూ గత వారంతో పోలిస్తే 6.3 శాతం మేర పెరగగా.. స్పాట్ గోల్డ్ 2.4 శాతం పుంజుకుని ఔన్సుకు 4,119.04 డాలర్ల వద్దకు చేరింది.
అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో నమోదైన జనవరి నాటి సర్వకాలిక గరిష్ట స్థాయిలైన Gold 5,589.38 డాలర్లు, వెండి 121.67 డాలర్ల స్థాయిలను మళ్లీ చేరడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టతరమని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల భౌగోళిక రాజకీయాల్లో వచ్చిన గొప్ప మార్పుల వల్ల కాకుండా.. మునుపటి బలహీనతను ఆసరాగా చేసుకుని చౌక ధరల్లో లభించే లోహాల కొనుగోలు వల్ల మాత్రమే జరిగిందని వారు విశ్లేషిస్తున్నారు.

ఇరాన్ యుద్ధ భయాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొంతవరకు లోహాలకు తోడ్పడినప్పటికీ.. పెరిగిన ముడిచమురు ధరల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ప్రమాదాలు, బలపడుతున్న అమెరికన్ డాలర్, అధికంగా ఉన్న వడ్డీ రేట్లు విలువైన లోహాల ఆకర్షణను తీవ్రంగా తగ్గిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు, పారిశ్రామిక రాగికి పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలు వెండికి కొంత కలిసొచ్చే అవకాశం ఉందని ఐఎన్‌జి వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.
పారిశ్రామిక లోహ రంగంలో స్థిరత్వం కారణంగా వెండి బంగారం కంటే మెరుగైన పనితీరును కనబరిచినా.. జూన్ త్రైమాసికంలో గత 13 ఏళ్లలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచిన Gold ధరలు మరింత దిగజారే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది. సాంకేతికంగా బంగారంలో 'డెత్ క్రాస్' ప్యాటర్న్ ఏర్పడటం, సుదీర్ఘమైన లోతైన దిద్దుబాటు ప్రమాదాన్ని సూచిస్తోంది.
ప్రస్తుతానికి వెండిలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం సరైన ప్రవేశ సమయం కాదని స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ హెచ్చరించింది. పెరిగిన అవకాశ వ్యయాలు, పెట్టుబడిదారుల అస్థిరమైన సెంటిమెంట్ కారణంగా వెండిలో ఆకర్షణీయమైన ప్రవేశ ధరల లక్ష్యాన్ని యూబీఎస్ ఔన్సుకు 55 డాలర్ల నుండి 48-50 డాలర్ల శ్రేణికి తగ్గించింది. వెండి ఇంకా తన నిజమైన దిగువ మద్దతు స్థాయిని కనుగొనలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు మైనింగ్ రంగానికి చెందిన అధికారులు మాత్రం లోహాల భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ధరల క్షీణత కేవలం సాధారణ సవరణ మాత్రమేనని.. మార్కెట్ విఫలమవ్వలేదని హైక్రాఫ్ట్ మైనింగ్ సీఈఓ డయాన్ గారెట్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వరుసగా 17 నెలలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో బంగారం ప్రధాన ఆర్థిక మూలస్తంభంగా మారుతోందని చెప్పారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం, సూపర్‌కంప్ల్యూటర్ల తయారీలో వెండి ఒక కీలకమైన పారిశ్రామిక లోహంగా మారినందున.. భవిష్యత్తులో దీనికి ప్రత్యామ్నాయం లేని డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
