ప్రస్తుతం బంగారం(Gold) , వెండి (Silver) ధరలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ధరలు ఎప్పుడూ లేనంతగా పెరగడమే కాకుండా రోజువారీ మార్పులు విపరీతంగా ఉండటంతో వ్యాపార రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద వెండి వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన రాజ్‌కోట్, ముంబైలోని జవేరీ బజార్ వంటి ప్రాంతాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి.

రాజ్‌కోట్ వెండి మార్కెట్‌లో నిశ్శబ్దం
ఒకప్పుడు నెలకు 25 నుంచి 30 టన్నుల వెండిని విక్రయించే రాజ్‌కోట్ వ్యాపారులు.. ఇప్పుడు కనీసం ఒక్క టన్ను అమ్మడానికి కూడా కష్టపడుతున్నారు. ధరల్లో వస్తున్న అస్థిరత వల్ల దాదాపు 1.5 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సిల్వర్ గోల్డ్ బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. రోజువారీ ధరల్లో రూ. 15,000 వరకు హెచ్చుతగ్గులు ఉండటంతో వ్యాపారులు కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి భయపడుతున్నారు. రాజ్‌కోట్‌లోని సుమారు 44 ట్రేడింగ్ సంస్థలు దివాళా తీయగా రూ. 3,500 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయాయి.
ధరల హెచ్చుతగ్గుల ప్రభావం
గతంలో బంగారం 10 గ్రాములు రూ. 1 లక్ష లోపు, వెండి కేజీ రూ. 1.1 లక్ష లోపు ఉన్నప్పుడు మార్కెట్ నిలకడగా ఉండేది. కానీ, 2026 జనవరి నాటికి వెండి ధర ఏకంగా రూ. 4 లక్షలకు చేరుకోవడం, బంగారం ధర రూ. 1.83 లక్షలకు చేరడంతో పరిస్థితి తలకిందులైంది. గతంలో టన్ను వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటే, అది కొన్ని వారాల క్రితం రూ. 36 కోట్లకు చేరింది. ఇంతటి భారీ పెట్టుబడి పెట్టడం చిన్న వ్యాపారులకు అసాధ్యంగా మారింది. డెలివరీకి, పేమెంట్ కి మధ్య ఉండే గ్యాప్ లో ధరలు విపరీతంగా పెరగడం వల్ల తయారీదారులు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
జవేరీ బజార్‌లో తగ్గిన కొనుగోళ్లు
ముంబైలోని ప్రసిద్ధ జవేరీ బజార్‌లో కస్టమర్ల రద్దీ గణనీయంగా తగ్గింది. పెళ్లిళ్ల కోసం నగలు కొనేవారు ఇప్పుడు తమ బడ్జెట్ ను సగానికి పైగా తగ్గించుకుంటున్నారు. గతంలో బంగారం కొనలేని వారు వెండిని ప్రత్యామ్నాయంగా ఎంచుకునేవారు. కానీ, ఇప్పుడు వెండి ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. జ్యువెలరీ వాల్యూమ్స్ 24 శాతం తగ్గినట్లు ప్రపంచ స్వరాకార మండలి (WGC) నివేదికలు చెబుతున్నాయి.
లిక్విడిటీ సమస్య
మరో వింతైన సమస్య ఏమిటంటే.. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని లేదా వెండిని అమ్మాలని చూసినా.. దుకాణదారులు కొనడానికి వెనుకాడుతున్నారు. వ్యాపారుల వద్ద నగదు కొరత ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పెట్టుబడిగా కొన్న గోల్డ్ (Gold) ను కష్టకాలంలో అమ్ముకోలేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. చిరు వ్యాపారులు నడిపే నెలవారీ పొదుపు పథకాలు కూడా ప్రస్తుతం ఆగిపోయే దిశలో ఉన్నాయి.
మొత్తానికి బంగారం ధరల పెరుగుతుంటే నగల షాపులు లాభాల్లో ఉంటాయి అనుకుంటారు చాలామంది. కానీ, నిజం అది కాదు. పెరుగుతున్న బంగారం ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వైపు మేలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది కార్మికులు, చిరు వ్యాపారుల జీవితాల్లో మాత్రం చీకటి నింపుతోంది. మార్కెట్ ఎప్పుడు నిలకడగా మారుతుందా అని ఇప్పుడు ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications