ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో.. మార్చి 27న భారతీయ బులియన్ మార్కెట్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. సాధారణంగా కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ధరలు పెరిగితే దానికి అనుగుణంగా ఈటీఎఫ్ (ETF)లు కూడా పెరగాలి. అయితే శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లాభాల్లో ఉన్నప్పటికీ, వెండి, బంగారానికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాల్లో ముగిశాయి.
వెండి మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఎంసీఎక్స్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ శుక్రవారం మధ్యాహ్నం సమయానికి సుమారు 2.75 శాతం పెరిగి, కిలోకు రూ. 2.26 లక్షల వద్ద ట్రేడయ్యింది. అయితే, ఇందుకు విరుద్ధంగా సిల్వర్ ఈటీఎఫ్‌లు సుమారు 4 శాతం వరకు పతనం కావడ గమనార్హం. ముఖ్యంగా గ్రోవ్ సిల్వర్ ఈటీఎఫ్ 4.04 శాతం క్షీణించి రూ. 21.83కి పడిపోగా, హెచ్‌డీఎఫ్‌సీ, డీఎస్‌పీ సిల్వర్ ఈటీఎఫ్‌లు కూడా దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి.

కోటక్, ఎడెల్‌వైస్ వంటి ఇతర ప్రముఖ వెండి ఈటీఎఫ్‌లు కూడా 3.6 శాతం నుండి 3.8 శాతం వరకు పడిపోయాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో బలం ఉన్నప్పటికీ, ఈటీఎఫ్‌లలో ఇలాంటి క్షీణత కనిపించడం అనేది పెట్టుబడిదారులు స్వల్పకాలిక లాభాలను స్వీకరించడం (Profit Booking), ధరల సర్దుబాటును సూచిస్తుంది.
బంగారం విభాగంలో కూడా ఇదే తరహా ధోరణి కనిపించింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల Gold ధర సుమారు 2 శాతం పెరిగి, రూ. 2,806 లాభంతో రూ. 1.43 లక్షల వద్ద ట్రేడ్ అయ్యింది. ఇంట్రాడేలో ఇది గరిష్టంగా రూ. 1.46 లక్షల మార్కును కూడా తాకింది. ఇక నిప్పన్ ఇండియా గోల్డ్ బీఈఎస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్‌లు మాత్రం సుమారు 1 శాతం మేర క్షీణించాయి. ఎంసీఎక్స్ ధరలు పెరుగుతున్నా ఈటీఎఫ్‌లు పడిపోవడం అనేది స్పాట్ ధరలకు, ఫ్యూచర్స్ కదలికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ మార్కెట్ అస్థిరతకు ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు. శాంతి చర్చలను తిరస్కరించిన నేపథ్యంలో, ఇరాన్‌పై మరింత కఠినమైన సైనిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. అయితే, ఏప్రిల్ 6 వరకు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్‌కు కొంత ఉపశమనం కలిగించింది.
ఆగ్మాంట్‌లోని పరిశోధన విభాగాధిపతి డాక్టర్ రెనిషా చైనాణి విశ్లేషణ ప్రకారం.. యుద్ధానికి సంబంధించి ఒక స్పష్టమైన పరిష్కారం కనిపించకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌పై నిరంతరం ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ అనిశ్చితి కారణంగానే బులియన్ ధరల పెరుగుదల ఒక పరిమితికి లోబడి ఉంటోంది. పెట్టుబడిదారులు ఇలాంటి అస్థిర సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్, ఈటీఎఫ్ ధరల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications