Forex Reserves: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా భారత విదేశీ మారకద్రవ్య నిల్వల డేటాను ప్రకటించింది. ఈ క్రమంలో వరుసగా మూడో వారం కూడా క్షీణించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 26 చివరి నాటికి దేశం మొత్తం విదేశీ మారక నిల్వలు 2.412 బిలియన్ డాలర్లు తగ్గి 637.922 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించింది.
ప్రస్తుత తరుణంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే గత వారం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.28 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు దిగజారినట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. దీనికి ముందు ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో విదేశీ మారకపు విలువ రికార్డు స్థాయిలో 648.562 బిలియన్ డాలర్లకు పెరిగింది.

మార్చి 2024లో భారత విదేశీ మారక నిల్వలు అంతకు ముందు 2021లో గరిష్ఠమైన 642.453 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి.. ఏప్రిల్ 5న కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. విదేశీ కరెన్సీ ఆస్తులు భారతదేశ విదేశీ మారక నిల్వలలో ముఖ్యమైన భాగం. ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.159 బిలియన్ డాలర్లు తగ్గి 559.701 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాస్తవానికి విదేశీ కరెన్సీ ఆస్తులను డాలర్లలో లెక్కిస్తారు. కానీ ఇందులో యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీ హోల్డింగ్స్ విలువ ఉంటుంది. విదేశీ నిల్వలలో మొత్తం పెరుగుదల లేదా పతనం విదేశీ కరెన్సీ ఆస్తులలో లెక్కించబడుతుంది.
విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన బంగారం నిల్వలు ఏప్రిల్ 26తో ముగిసిన వారంలో 1.275 బిలియన్ డాలర్లు తగ్గి 55.533 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఒకపక్క అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్న వేళ వ్యూహాత్మకంగా ఇండియా తన నిల్వలను కొంత విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది నిల్వలు తగ్గటానికి దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ $15 మిలియన్లు పెరిగి $18.048 బిలియన్లకు చేరాయి. అలాగే IMF వద్ద భారత్ నిల్వలు 8 మిలియన్ డాలర్లు పెరిగి 4.639 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications