మరోసారి విమానాల రద్దు ప్రకటించిన గో ఫస్ట్.. నెలరోజుల్లో ఇలా ఎన్నిసార్లు చేసిందంటే..
GoFirst: తమ ఎయిర్ లైన్స్ భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతున్నందున.. జూన్ 4 వరకు విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ప్రకటించింది. మే 3 నుంచి సేవలు నిలిపివేయగా తాజా అప్ డేట్ ప్రకారం ఈ బడ్జెట్ క్యారియర్ నెల పాటు గ్రౌండింగ్ లో ఉన్నట్టే. మొదటగా మే 2న మూడు రోజుల పాటు సర్వీసులను ఆపేసిన తర్వాత.. విమానాల రద్దును పొడిగించడం ఇది ఎనిమిదోసారి.
"ఆపరేషనల్ కారణాల వల్ల జూన్ 4, 2023 వరకు షెడ్యూల్ చేయబడిన గో ఫస్ట్ విమానాలు రద్దు చేయబడ్డాయి" అని ఎయిర్ లైన్ తన ట్వీట్‌లో పేర్కొంది. త్వరలోలో బుకింగ్ మనీ పూర్తి వాపసు ఇవ్వబడుతుందని తెలిపింది. ఇటీవల తక్షణ పరిష్కారం మరియు కార్యకలాపాల పునరుద్ధరణ కోసం కంపెనీ దరఖాస్తును దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా "మేము త్వరలో బుకింగ్‌లను పునః ప్రారంభించగలుగుతాము" అని పేర్కొంది.

ప్రస్తుతం గో ఫస్ట్ క్యారియర్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. అయితే గత వారం ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA పునరుద్ధరణ ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలని కోరింది. దీనిపై ఎయిర్‌లైన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సీనియర్ DGCA అధికారులతో పునరుద్ధరణ ప్రణాళికపై సోమవారం చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి ఈ ట్వీట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
US ఇంజిన్ మేకర్ ప్రాట్ & విట్నీ ఇంజిన్‌లను డెలివరీ చేయనందున కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నట్లు బడ్జెట్ క్యారియర్ అంతకు ముందు పేర్కొంది. మే 2న స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియల కోసం ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) మే 10న అంగీకరించింది. అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


Click it and Unblock the Notifications