Hyderabad: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. భారతదేశంతో పాటు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గుర్తింపు పొందినట్లు జీఎమ్ఆర్ సంస్థ ప్రకటించింది. ఈ రోజు 2023 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డుల్లో.. 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్' అవార్డు కూడా పొందిందని GHIAL CEO ప్రదీప్ పణికర్ వెల్లడించారు.
ప్రయాణికులకు అద్భుతమైమ ప్రయాణ అనుభవాన్ని అందించాలనే నిబద్ధతకు ఈ అవార్డు అందుకున్నట్లు సీఈవో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన తమ విమానాశ్రయ సిబ్బంది, హైదరాబాద్ విమానాశ్రయంలో పనిచేస్తున్న భాగస్వాముల కృషి, అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగు పరచటానికి, సురక్షితమైన అనుభవాన్ని కలిగించేందుకు పనిచేసేందుకు ఈ అవార్డు ప్రేరేపిస్తుందని అన్నారు.

విమానాశ్రయ పరిశ్రమలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. వీటిని కస్టమర్లు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫాక్షన్ సర్వే ద్వారా ఎన్నుకుంటారు. 550కి పైగా విమానాశ్రయాల్లో కస్టమర్ సర్వీస్, సౌకర్యాలను అంచనా వేస్తూ.. ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌గా ఈ అవార్డులను పరిగణిస్తారు. ఈ సర్వేలను ఏ విమానాశ్రయ నియంత్రణకూ లోబడకుండా స్వతంత్రంగా నిర్వహిస్తారు.
ఈ అవార్డులను 6-నెలల సర్వే వ్యవధిలో 60 కంటే ఎక్కువ దేశాల విమానాశ్రయ కస్టమర్లు పూర్తి చేసిన వరల్డ్ ఎయిర్‌పోర్ట్ సర్వే ప్రశ్నాపత్రాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ సర్వే ద్వారా చెక్-ఇన్, రాకపోకలు, ట్రాన్ఫర్స్, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్ నుంచి గేట్ వద్ద బయలుదేరే వరకు ఎయిర్‌పోర్ట్ సర్వీస్ కస్టమర్ల అనుభవం వంటి కీలక సూచికలను అవార్డు ఎంపిక కోసం పరిశీలిస్తారు. స్కైట్రాక్స్ 1999లో ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సాటిస్‌ఫ్యాక్షన్ సర్వేను ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రపంచ ఎయిర్ పోర్టుల అవార్డులు ఇవ్వడం ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications