అమెరికా చరిత్రలో అతిపెద్ద రీకాల్, 60 లక్షల వాహనాలు వెనక్కి
అమెరికా జనరల్ మోటార్స్ దాదాపు 60 లక్షల పెద్ద పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కి పిలిపించనుంది. వీటిలో ప్రమాదకర తకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ప్లేటర్లు అమర్చారు. వీటిని వెనక్కి పిలిపించాలని జనరల్ మోటార్స్‌ను అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాటికి మరమ్మతు చేసి తిరిగి యజమానులకు అప్పగించాలని సూచించింది. వీటికి దాదాపు రూ.9వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

భద్రత కంటే లాభానికి ప్రాధాన్యత
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సోమవారం ప్రకటించిన ఈ నిర్ణయం వల్ల వాహన తయారీదారులకు 1.2 బిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో ఇది మూడోవంతు. రీకాల్‌ను తప్పించుకోవడం కోసం జీఎం 2016 నుండి నాలుగుసార్లు పిటిషన్ వేసింది. ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్, కానిస్టర్స్ రోడ్డు పైన, పరీక్షలో సురక్షితంగా ఉన్నాయని జీఎం మోటార్స్ పేర్కొంది. అయితే వీటిని కొనుగోలు చేసిన యజమానులు మాత్రం కంపెనీ తమ భద్రత కంటే లాభాల కోసం చూసిందని ఆరోపించారు.

ఇలా ప్రమాదకరం..
తకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ కారణంగా అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆటో (సిరీస్) రీకాల్స్ చోటు చేసుకున్నాయని తెలిపింది. దాదాపు 63 మిలియన్ల ఇన్‌ఫ్లేటర్స్‌ను రీకాల్ చేయనున్నారు. వాహనాలు ఢీకొన్నప్పుడు, చిన్నపాటి పేలుడు జరిగి ఎయిర్ బ్యాగ్స్ గాలితో నిండటానికి అనువుగా అమ్మోనియం నైట్రేట్‌ను తకాటా ఎయిర్ బ్యాంక్ ఇన్‌ఫ్లేటర్లలో వాడుతున్నట్లు జీఎం మోటార్స్ పేర్కొంది. ఈ రసాయన పదార్థం వేడికి, తేమకు బహిర్గతమైతే అధిక శక్తితో పేలుతోందని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు పోతున్నాయని యజమానులు చెబుతున్నారు.

అందుకే వెనక్కి
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 27 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా, ఇందులో 18 మంది ఒక్క అమెరికాలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లు కలిగిన జీఎం ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కి పిలిపించి, వాటిని సరి చేసి యజమానులకు అందించాలని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కంపెనీని ఆదేశించింది.